బ్రేకింగ్: ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్.. ఇంకా ఆఫీస్ లోపలే కవిత!
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ వరుసగా రెండవ రోజు ఈడీ అధికారులు కవితను సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు దర్యాప్తు మొదలు పెట్టిన ఈడీ ఎంక్వెయిరీ బృందం కవితపై ఇంకా ప్రశ్నల వర్షం కురిపిస్తునే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలకంగా వ్యవహారించిన సౌత్ గ్రూప్, బుచ్చిబాబు.. పిళ్లైలతో గల సంబంధం.. సిసోడియా, విజయ్ నాయర్‌లతో గల రాజకీయ సంబంధాలపై దాదాపు 7 గంటలకు పైగా అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ రోజు కవిత తన పాత ఫోన్‌లను కూడా విచారణకు తీసుకెళ్లిన నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి అవుతోన్న కవిత ఈడీ విచారణ ముగియకపోవడం.. ఈ స్కామ్‌లో కవిత అరెస్ట్ అవుతారంటూ వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఏం జరగబోందో అని బీఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కవితకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలను రంగంలోకి దింపి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత లీగల్ టీమ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.