బాలవికాసలో రెండో రోజూ ఐటీ దాడులు.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థపై రెండోరోజూ గురువారం ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి.
దిశ, వరంగల్ బ్యూరో : బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థపై రెండోరోజూ గురువారం ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మొదలైన సోదాలు రాత్రి వరకు సాగాయి. అనంతరం గురువారం ఉదయయే మళ్లీ మొదలయ్యాయి. హనుమకొండ జిల్లా కాజీపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 40 కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే రెండో రోజూ మాత్రం కేవలం కాజీపేటలోని ప్రధాన కార్యాలయంలోనే కొనసాగుతున్నట్లుగా సమాచారం.
సంస్థ కార్యాలయం వద్ద నిషేధాజ్ఞలు విధించిన ఐటీ అధికారులు, సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఫోన్లను సీజ్ చేశారు. గురువారం ఉదయం నుంచి ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ సీఈవో శౌరిరెడ్డి ఇంట్లో, హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. సంస్థకు నిధులు ఎక్కడికెక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లు, కొన్ని కీలకమైన పత్రాలను, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో వేల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించిన ఘనత బాలవికాసకు ఉంది. గ్రామీణ విద్యార్థుల చదువులకు సాయం చేయడం, మహిళలకు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, రైతులకు సాగులో శిక్షణ, రుణాల రూపంలో సాయం చేయడం కార్యక్రమాలు చేపడుతోంది. చెరువుల్లో పూడికతీత పనులను సైతం కొనసాగించింది. కాజీపేట మెయిన్ ఆఫీస్ నుంచి మూడు దశాబ్దాలుగా దేశ, విదేశాల నుంచి నిధులు సేకరించి బాల వికాస సంస్థ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాల వికాస క్రిస్టియన్ మిషనరీ సంస్థ అయినందునే కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొనడం గమనార్హం.