‘దళితబంధు’ స్కీమ్‌లో స్కామ్.. లబ్ధిదారుల బలహీనతే టార్గెట్!

దళితుల సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీంను ప్రకటించారు..

Update: 2023-03-03 03:10 GMT

దళిత బంధు లబ్ధిదారుల బలహీనతలను లోకల్ లీడర్లు సొమ్ము చేసుకుంటున్నారు. స్కీమ్ మంజూరు చేయించి వారికి ఎంతో కొంత ముట్ట చెబుతున్నారు. మరి కొంత సొమ్మును అధికారులతో కలిసి పంచుకుంటున్నారు. యూనిట్ల నిర్వహణలో ఎక్స్ పీరియన్స్ లేకపోవడంతో చాలా చోట్ల లబ్ధిదారులు తమకు మంజూరైన యూనిట్లు అమ్ముకుంటున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. విషయం గ్రహించిన ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్తగా మొబైల్ యాప్ రూపొందించి, వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: దళితుల సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీంను ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. ఏదో ఒక యూనిట్ ఎంపిక చేసుకొని లబ్ధిదారుడు రన్ చేయాల్సి ఉంటుంది. అనుభవం లేకుంటే ప్రభుత్వమే శిక్షణ ఇప్పిస్తుంది. అయితే ఇదంతా స్కీమ్ అమలు చేసిన కొత్తలో జరిగింది. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ స్కీమ్ పక్కదారి పడుతున్నది.

పొలిటీషియన్లు, అధికారుల కుమ్మక్కు

చాలా చోట్ల స్కీమ్ పక్కదారి పట్టేందుకు లోకల్ పొలిటీషియన్లు, అధికారులు కుమ్మక్కవుతున్నట్టు తెలుస్తున్నది. వీరిద్దరూ కలిసి లబ్ధిదారుల బలహీనతను అనుకూలంగా మలుచుకుంటున్నారు. లబ్ధిదారునిగా ఎంపిక చేసినందుకు పది లక్షల్లో ఆరు లక్షల వరకు అతనికిచ్చి, మిగతా సొమ్మును పంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

అయితే యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని రూల్స్‌ను పక్కాగా ఫాలో అవుతున్నారు. ఇందుకు ఉత్తర తెలంగాణలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను ఉన్నతాధికారులు ఉదాహరణగా చూపుతున్నారు. ‘ఓ లబ్ధిదారుడు ఓ షాపును ఏర్పాటు చేశారు. అందుకు కావాల్సిన మెటీరియల్ తెప్పించారు. సప్లయ్ చేసిన డీలర్ నుంచి బిల్లు తీసుకున్నారు.

డీలర్ అకౌంట్‌లో డబ్బులు వేశారు. షాపు నిర్వహిస్తున్నట్టు లబ్ధిదారుడు ఉన్న ఫొటోలు కూడా తయారు చేయించారు. కానీ, షాపు మాత్రం స్థానికంగా ఎక్కడా లేదనే విషయాన్ని ఆ తర్వాత గుర్తించారు.

చేతులు మారుతున్న యూనిట్స్

చాలా మంది లబ్ధిదారులు తాము ఎంపిక చేసుకున్న యూనిట్‌ను కొంత కాలమే నిర్వహించి, ఆ తర్వాత ఇతరులకు విక్రయిస్తున్నారు. తాము ఆ పని చేయలేకపోతున్నామని, గిట్టుబాటు కావడం లేదనే కారణాలు చెబుతున్నారు. ఈ కేటగిరిలో ప్రధానంగా కార్లు, ట్రాక్టర్లు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. వాటికి తగిన గిరాకీ రాకపోవడంతో ఇతరులకు ఎంతో కొంతకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.

అవగాహన కల్పించడంలో లోపం

యూనిట్ ఎంపికలో ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతున్నట్లు తెలుస్తున్నది. రూ.10 లక్షలతో ఏదో ఒక యూనిట్‌‌ను కొనుగోలు చేసి దాన్ని మెయింటేన్ చేయడం కంటే, ఎంతో కొంత డబ్బులు చేతికి వస్తే చాలు అనే ధోరణిలో కొందరు ఉండటంతో స్కీమ్ పక్కదారి పడుతున్నదని ఓ సీనియర్ అధికారి వివరించారు. లబ్ధిదారులకు ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరమున్నదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.

త్వరలో యాప్

లబ్ధిదారుల విజయగాథలను ప్రపంచానికి తెలిపేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మిగతా లబ్ధిదారుల్లో చైతన్యం వస్తుందని చెబుతున్నారు. అయితే లబ్ధిదారులు తాము ఎంపిక చేసిన యూనిట్స్‌ను సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం ద్వారా రెగ్యూలర్ మానిటరింగ్ అవసరమనే అభిప్రాయాలు ఉన్నాయి.

Tags:    

Similar News