పోరుబాటలో సర్పంచ్‌లు.. సర్కారుపై సమరానికి సిద్ధం!?

పల్లెలు ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలు.. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తుంటారు.

Update: 2023-05-09 04:00 GMT

పల్లెలు ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలు.. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తుంటారు. అందుకు అనుగుణంగానే పల్లెల్లో ప్రగతి పనులను చేపట్టారు. కానీ పనులు చేసిన సర్పంచ్‌లకు ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించని పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్యలకు ఒడిగట్టిన ఘటనలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ ఇన్నాళ్లు ఓపిక పట్టిన ఇక సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వంపై కదం తొక్కేందుకు సిద్ధమవుతున్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాల సర్పంచ్‌లు పెండింగ్ బిల్లుల కోసం వినతుల వరకు వెళ్లారు. త్వరలో ధిక్కార గళం వినిపించేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్​బిల్లుల కోసం మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సర్పంచ్‌లు మూకుమ్మడిగా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఇకపోరు బాటేనని తేల్చిచెబుతున్నారు. – దిశ, మెదక్ ప్రతినిధి

గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ వేదికలపై గొప్పలు చెబుతుంది. ఇటీవల జాతీయ స్థాయిలో అవార్డులు సర్కారు ఖాతాలో వేసుకుంది. కానీ అందుకు అహర్నిశలు కృషి చేసి ఫలితాలు సాధించిన సర్పంచుల కష్టాలను మాత్రం ప్రభుత్వం విస్మరిస్తోంది. ఇందుకు నిదర్శనమే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ల ఆర్థిక భారంతో చేసుకున్న ఆత్మహత్యలే.. పల్లె ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశ పెట్టిన అమలు చేసే బాధ్యత సర్పంచ్‌లపైనే ఉంటుంది.

క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, మన ఊరు–మన బడి, వైకుంఠ ధామాలు, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు చేసేది సర్పంచ్‌లే. ప్రభుత్వం పథకం ప్రవేశ పెట్టిన వెంటనే నిధులు రాకున్నా.. నిర్మాణాలు చేపట్టడంతో జిల్లాలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు పెరిగి పోతూనే ఉన్నాయి. నిర్మాణం కోసం సిమెంట్, స్టీల్, ఇతర సామగ్రి కొనుగోలు చేసిన సర్పంచ్‌లు బిల్లులు వచ్చే వరకు అనే ఒప్పందంతో తెస్తారు.. కానీ నెలల్లో రావాల్సిన బిల్లులు ఏళ్లుగా మంజూరు కాకపోవడంతో వడ్డీకి అప్పులు తేవాల్సిన పరిస్థితి వస్తుంది.

అప్పులకు వడ్డీలు పెరగడం మినహా బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా అంతగా లేని సర్పంచ్‌లు అప్పుల ఊబిలో చిక్కి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటితో పాటు గత సెప్టెంబర్ మాసం నుంచి ఎస్ఎఫ్‌సీ నిధులకు ఫ్రీజింగ్ పెట్టడంతో గ్రామాల సర్పంచ్‌లు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికార పార్టీలో ఉన్నామన్న కారణంతో ఇప్పటి వరకు వేచి చూసే దోరణిలో ఉన్న సర్పంచ్‌లు ఆందోళన బాట పట్టేందుకు అడుగు ముందుకు వేశారు.

మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పెండింగ్ నిధుల కోసం వినతి..

గ్రామ పంచాయతీలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంపై అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లిన సర్పంచ్‌ల సహనం నశించి కలెక్టరేట్ మెట్లు ఎక్కారు. పదవీ కాలం ముగింపు దశకు వస్తున్న ఇప్పటికీ సకాలంలో బిల్లులు రాకపోవడంపై ఆగ్రహించిన పలువురు సర్పంచ్‌లు కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రం అందజేశారు. ఏళ్లుగా పెండింగ్ బిల్లులు ఉన్న ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఆరు నెలలుగా ఎస్ఎఫ్‌సీ నిధుల ఫ్రీజింగ్‌తో సర్పంచ్ లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బిల్లులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో పనులకు బిల్లుల జాప్యంతో వచ్చిన బిల్లులు వడ్డీకే సరిపోతుందని సర్పంచ్ లు వాపోతున్నారు..

రాజీనామాకు సిద్ధమైన సర్పంచ్‌లు..?

జిల్లాల్లో 469 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో అత్యధిక శాతం అధికార పార్టీకి చెందిన సర్పంచ్ లే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంచి పనులు చేసిన సర్పంచ్‌లు బిల్లుల కోసం వెళ్లి తమ గోస చెప్పుకున్న అది రాష్ట్ర స్థాయి సమస్యగా ఇన్నాళ్లు నచ్చజెప్పారు. తీరా సర్పంచ్‌ల పదవీ కాలం దగ్గర పడుతున్న గెలిచినప్పుడు ఉన్న సమస్యలు ఇంకా కొనసాగడంతో అత్యధిక శాతం సర్పంచ్‌లు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సమస్య తీరే అవకాశం లేదన్న ఉద్దేశంతో తప్పని స్థితిలో నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కొన్ని మండలాల్లో పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది.

ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బుజ్జగించి శాంతింపజేసినా సమస్యలు మాత్రం అలాగే ఉండడంతో ఆందోళనకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన మెదక్, హవేలీ ఘనపూర్, చిన్నశంకరంపేట, నిజాంపేట మండలాలకు చెందిన సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం వినతి పత్రాన్ని కలెక్టర్‌కు ఇచ్చారు. సిద్దిపేటలో కూడా వినతి పత్రం ఇవ్వడం గమనార్హం. త్వరలో ఉమ్మడి జిల్లాతో పాటు అంతటా సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన బాట పట్టేందుకు సైతం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆదిలోనే ప్రభుత్వ స్పందించి సమస్యలు పరిష్కరిస్తుందా.. లేక ఇలాగే సాగదీస్తుందా అనేది చూడాల్సి ఉంది. 

Tags:    

Similar News