ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంగారెడ్డి కలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పోలుస్తూ సీఎం కేసీఆర్‌ను సంగారెడ్డి కలెక్టర్ డా.శరత్ పొగడ్తలతో ముంచెత్తారు.
దిశ, సంగారెడ్డి: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పోలుస్తూ సీఎం కేసీఆర్‌ను సంగారెడ్డి కలెక్టర్ డా.శరత్ పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను, కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో అమరుల త్యాగాల స్ఫూర్తి నిండాలన్న ఉద్దేశంతో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహించామన్నారు. జాతీయ సమైక్యతను చాటేలా 16 నుండి 18 వరకు మూడు రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పేద వర్గాల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టిన గిరిజన బిడ్డగా తన మనసులోని మాటలను ఒక పౌరుడిగా చెబుతున్నానని, మన సీఎం అభినవ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్‌ను తాను చూడలేదని, కానీ ఈనాటి అభినవ అంబేద్కర్ అయినటువంటి కేసీఆర్‌ను చూస్తున్నానన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని అన్నారు. భూమిలేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అణగారిన వర్గాల అభ్యున్నతి పట్ల సీఎంకు ఉన్న అభిమానానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారంటే దళిత వర్గాల పట్ల వారికున్న ప్రేమ, ఆదరాభిమానాలు వెలకట్టలేనివని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో భూమికోసం, భుక్తి కోసం పోరాడి ఎందరో అమరులైనారని, వారి త్యాగాల ఫలితమే నేడు స్వతంత్ర రాష్ట్రంలో స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ చేనేత మరియు హ్యాండ్లూమ్స్ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటాలతో సాధించుకున్నామని, అలాంటి తెలంగాణను దేశంలో ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుటిత దీక్షతో పనిచేస్తున్నారన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోని రాష్ట్రాలన్నింటికీ ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. సమైక్యతను చాటుకునే అన్ని కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, డీఈవో రాజేష్, జిల్లా అధికారులు, ఆర్డీఓ, స్వతంత్ర సమరయోధులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.