త్వరలో కొత్త పింఛన్ల మంజూరు.. ప్రజావాణి రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టి

ప్రజలు అనేక ఆకాంక్షలతో వారి సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారని, వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేయాలని నోడల్ అధికారిని ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Update: 2024-08-04 17:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలు అనేక ఆకాంక్షలతో వారి సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారని, వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేయాలని నోడల్ అధికారిని ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క... త్వరలోనే అదనపు సిబ్బందిని కేటాయించనున్నట్లు తెలిపారు. ఎక్కువగా రేషను కార్డులు, ధరణి సమస్యలు, పింఛన్లకు సంబంధించినవే ఉంటున్నట్లు గ్రహించిన ఆయన... త్వరలోనే ఆరు గ్యారంటీలలో ప్రకటించిన పెన్షన్లను అందజేస్తామని స్పష్టత ఇచ్చారు. దాని గురించి ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో లోతుగా చర్చ జరిగిందని గుర్తుచేశారు. కొత్త రేషను కార్డుల జారీకి సంబంధించి మూడు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశామని, విధివిధానాలు ఖరారైన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని డ్రైవ్ ప్రారంభిస్తుందన్నారు. స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యతో సచివాలయంలో ఆదివారం నిర్వహించిన రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం పై క్లారిటీ ఇచ్చారు.

అవకాశం ఉన్న ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని, ఇక నుంచి ప్రతీ మూడు నెలలకు ఒకసారి తాను ప్రజావాణికి వచ్చిన గ్రీవెన్స్, పరిష్కారం అయిన అంశాలు, పెండింగ్‌లో ఉన్నవి, ప్రభుత్వ జోక్యం అవసరమైనవి... ఇలా అన్ని కోణాల నుంచి సమీక్షించనున్నట్లు తెలిపారు. ప్లానింగ్ డిపార్టుమెంటు నిర్వహించే ఈ రివ్యూలో ప్రభుత్వం తీసుకునే పాలసీలకు మార్పులు అవసరమని నోడల్ ఆఫీసర్ భావించినట్లయితే వాటిని రాతపూర్వకంగా తెలియజేయాలని దివ్యకు సూచించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు, వాటికి చూపుతున్న పరిష్కారం, ప్రజల నుంచి వస్తున్న స్పందన తదితరాలపై నోడల్ ఆఫీసర్ నుంచి డిప్యూటీ సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ఏ శాఖకు చెందినవి ఎక్కువగా ఉన్నాయో ఆరా తీశారు. పరిష్కరించే క్రమంలో ఆయా శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్ల వైఖరిని అడిగి తెలుసుకున్నారు.

ఫిర్యాదును స్వీకరించిన తర్వాత మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు పరిష్కారమైన తర్వాత మళ్ళీ ఒక ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నట్లు నోడల్ ఆఫీసర్ దివ్య వివరించారు. కానీ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత పరిష్కారం అయ్యేంత వరకు అది ఏ దశలో ఉందో తెలుసుకునే ట్రాకింగ్ సిస్టమ్ లేదని, ఇది కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకు సగం ఆందోళన తగ్గుతుందని, దీన్ని అమలులో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు డిప్యూటీ సీఎంకు దివ్య వివరించారు. కొత్త రేషన్ కార్డుల కోసం వస్తున్న దరఖాస్తుల విషయంలో ప్రజలకు అనేక ఇబ్బందులున్నాయని డిప్యూటీ సీఎంకు ఆమె వివరించగా, రేషను కార్డులు కేవలం రేషను దుకాణాల ద్వారా సరుకులు అందుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, సంక్షేమ పథకాలు పొందేందుకు వేరే రకమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలనే చర్చ జరుగుతున్నదని, దీనిపై త్వరలోనే నిర్ణయం జరుగుతుందని డిప్యూటీ సీఎం వివరించారు.

మహిళల సమస్యల గురించి ఈ సమావేశం చర్చ జరగ్గా డిప్యూటీ సీఎం చొరవ తీసుకుని... మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా పూర్తి ప్రయోజనం రాదని, వాటిని వాడుకునేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నదన్నారు. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సాయాన్ని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. అయితే దీనికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక మెకానిజం ఏర్పడాల్సి ఉన్నందున కలెక్టర్లతో చర్చించిన తర్వాతే ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. గృహజ్యోతి స్కీమ్ కింద జీరో విద్యుత్ బిల్లు దరఖాస్తులపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మండల స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బీహార్‌తో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ పద్ధతులు అవలంబిస్తున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలన్న రిక్వెస్టుకు సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం... మౌలిక సదుపాయాలతో పాటు అదనపు సిబ్బందిని కూడా నియమించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పూర్తిచేసిన కొన్ని కేసుల గురించి సమావేశంలో నోడల్ అధికారి దివ్య వివరిస్తూ... ఇటీవల వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు వేలాడుతున్న విషయాన్ని మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ రైతు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని, స్థానిక విద్యుత్ అధికారులు రెండు రోజుల్లోనే పరిష్కరించారని వివరించారు. ఫిర్యాదు చేసిన రైతే తిరిగి అధికారులను సంప్రదించి అభినందించారని తెలిపి ఆ రైతు రాసిన లేఖను చూపించారు.

Tags:    

Similar News