ఇదెక్కడి న్యాయం.. ఆర్టీసీకి లాభాలు వస్తేనే జీతాలు పెంచుతారా?
ఆర్టీసీ లాభాలు వస్తేనే కార్మికులకు వేతనాలు పెంచుతామని స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పడం విచిత్రంగా ఉన్నదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కే.రాజిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ లాభాలు వస్తేనే కార్మికులకు వేతనాలు పెంచుతామని స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పడం విచిత్రంగా ఉన్నదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కే.రాజిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మె్ల్సీ జీతాలు ఎలా పెంచారు? అంటూ ఫైర్అయ్యారు. ప్రభుత్వం ఆర్టీసీకి బడ్జెట్‌లో పెట్టిన రూ.1500 కోట్లు ఏ మూలకూ రావాని తేల్చి చెప్పారు.
ఆర్టీసీ కార్మికులకు ఇప్పటివరకు 2 పే స్కేల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, అనేకమార్లు రిక్వెస్ట్చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, అజయ్‌లు ఆర్టీసీకి అనేక హామీలు ఇచ్చి మరిచారన్నారు. ఇక ఎలక్ట్రిక్ బస్సులు, స్లీపర్ బస్సులతో ఆర్టీసిలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్‌ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.