పిల్ల పాపలతో రోడ్డెక్కిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. CM కేసీఆర్‌పై RSP ఫైర్

పంచాయతీ కార్యదర్శులు ఫాంహౌస్, ప్రగతి భవన్ అడగడం లేదని కేవలం వారిని పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు.

Update: 2023-05-01 12:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పంచాయతీ కార్యదర్శులు ఫాంహౌస్, ప్రగతి భవన్ అడగడం లేదని కేవలం వారిని పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. సోమవారం మునుగోడులో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆర్ఎస్పీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సచివాలయం ఓపెనింగ్ సందర్భంగా ఐదు వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసినప్పుడు, పంచాయతీ కార్యదర్శులు ఎందుకు గుర్తురాలేదని మండిపడ్డారు.

వాస్తవానికి ప్రొహిబిషన్ పీరియడ్ రెండు సంవత్సరాలకు మించి ఉండరాదు, అయినా నిబంధనలకు విరుద్దంగా మూడు సంవత్సరాలు పెట్టి, చట్ట విరుద్దంగా మరో సంవత్సరం పొడిగించారని, నాలుగు సంవత్సరాలు గడిచినా క్రమబద్ధీకరించడం లేదన్నారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన కమిషనర్, మంత్రి, ముఖ్యమంత్రిపై 420 కేసు పెట్టాలన్నారు. పది వేల మంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని, పసిపిల్లలతో రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు చివరి వరకు మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యదర్శులు ఏ మాత్రం చింతించవద్దని, హక్కుల కోసం మనం పోరాడాలని సూచించారు.

అంబేద్కర్ పేరుతో సచివాలయం ఏర్పాటు చేశారు కానీ ఆయన సాక్షిగా చెప్పినవన్ని అబద్ధాలేనని విమర్శించారు. పునర్నిర్మాణం అంటే ఒక తరాన్ని అభివృద్ధి చేయడమని, కానీ కేసీఆర్ చెబుతున్నది పునర్నిర్మాణం కాదని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. లక్ష ఇళ్లు అని పాత పేపర్ల మీద సంతకం పెట్టి డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరి వద్ద మూడు లక్షల లంచం తీసుకున్నారని, వారందరిని కేసీఆర్ ఏసీబీకి ఎందుకు అప్పగించడం లేదు.? అని నిలదీశారు.

Tags:    

Similar News