'పేదలంటే కేసీఆర్‌కు ఎందుకంత భయం'
ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'పేద ప్రజలంటే ఎందుకంత భయం, కేసీఆర్ జీ' అని సీఎంని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మరో ట్వీట్ చేస్తూ.. ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, తమిళనాడు లాగా సంపూర్ణ మెజారిటీ ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో, జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని వర్గాలకు రిజర్వేషన్‌ను పెంచాలన్నారు. సామాజిక న్యాయంపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
భవనాలకు పేర్లు పెట్టడంతోనే పని ఐపోదని విమర్శించారు. మరో ట్వీట్ చేస్తూ.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ప్రైవేట్ పీఏ శివ వరంగల్‌లోని లా విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడని వచ్చిన వార్తలపై అర్ఎస్పీ స్పందించారు. సిరిసిల్ల నిర్మల్ సంఘటనలు మర్చిపోక ముందే మరో అఘాయిత్యం అని, ఈ దుర్మార్గులకు అంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తున్నదని, అభయం ఎవరిస్తున్నరని ప్రశ్నించారు. అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా ట్వీట్ చేస్తూ.. శ్రీకాంత్ చారి త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ఇంత గొప్ప త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ చివరికి స్కాంల మయమైపోయిందని పేర్కొన్నారు. మళ్లీ తెలంగాణను విముక్తి చేసి అమరుల ఆశయాలను నిజం చేయడమే మనం వారికిచ్చే ఘనమైన నివాళి అంటూ ట్వీట్ చేశారు.