సీలింగ్ నుంచి పట్టాగా రూ.100 కోట్ల భూమి.. బడాబాబుల భూపందేరం!

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు ఏం తలచుకుంటే అది పక్కా.

Update: 2023-03-31 09:15 GMT
సీలింగ్ నుంచి పట్టాగా రూ.100 కోట్ల భూమి.. బడాబాబుల భూపందేరం!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు ఏం తలచుకుంటే అది పక్కా. ఏది చేయాలనుకుంటే అది జరిగిపోతుంది. సామాన్యులైతే తమ సమస్యను పరిష్కరించండంటూ ఏండ్ల కొద్దీ తిరుగుతూనే ఉండాలి. కానీ తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ తలచుకుంటే.. గంటల్లో పని కాకుండాపోతుందా? అది ఎంతటి సమస్యైనా సరే.. వాళ్లకు నచ్చిందంటే చేసేయడం పెద్ద కష్టమేం కాదు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రిపోర్ట్ ఇస్తాడు. తహశీల్దార్ ఎండార్స్ చేస్తాడు. కలెక్టరేట్‌కి వెళ్తుంది. ఆ తర్వాత కలెక్టర్ లాగినై రికార్డు మార్చేస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంలో వేర్వేరుగా స్పందిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి కాదు.. ఆ హక్కుదారులు, దరఖాస్తుదారులను బట్టి పరిష్కారమయ్యే కాల పరిమితి ఆధారపడింది. ఐతే మొన్నటి దాకా ఆ భూములు సీలింగ్ సర్ ప్లస్ భూములు, ప్రభుత్వ భూమి, సర్కారీ భూమి, భూదాన్ భూమి.. ఇలా ఏ క్లాసిఫికేషన్ ఉంటేనేం? ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 2021 నుంచి 2023 జనవరి వరకు జారీ చేసిన ఆర్డర్లను పరిశీలిస్తే వందల ఎకరాల క్లియరెన్స్ ఇచ్చారు.

ధరణి డేటా మోడిఫికేషన్ సిస్టం(డీడీఎంఎస్) ద్వారా దశాబ్దాలుగా కొనసాగుతున్న క్లాసిఫికేషన్ ని పట్టా భూములుగా మార్చారని తెలిసింది. అందులో భాగంగానే ఇబ్రహింపట్నం మండలం ఆదిబట్లలోనూ సీలింగ్ సర్ ప్లస్ భూములకు కూడా క్లియరెన్స్ ఇచ్చారు. రూ.100 కోట్ల విలువైన భూమికి క్లియరెన్స్ ఇచ్చారు. ధరణి పోర్టల్‌లో పట్టా భూమిగా మార్చేసి క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఐతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్ సైట్ లో మాత్రం ఇప్పటికీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్‌లోనే ఉండడం గమనార్హం. అక్కడ సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్‌గానే కొనసాగుతున్నది. ఏ ప్రాతిపదికన పట్టా భూమిగా మార్చారో అంతుచిక్కడం లేదు.

రికార్డుల్లో ఇలా..

ప్రభుత్వం ఆదిబట్లలో వందలాది ఎకరాలను సేకరించింది. టీఎస్ఐఐసీకి అప్పగించింది. టీసీఎస్, సమూహా వంటి అనేక కంపెనీలు కొలువుదీరాయి. దాంతో ఆ ప్రాంతానికి అత్యధిక విలువ సంతరించుకున్నది. కొంత సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ కూడా టీఎస్ఐఐసీ ఆధీనంలోకి వచ్చింది. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించిన తర్వాతే ఆ ఏరియాలో ఐటీ పార్కును ఏర్పాటు చేశారు. సర్వే నం.44 లోని 13.26 ఎకరాలు కూడా సీలింగ్ సర్ ప్లస్ భూమిగా రికార్డుల్లో నమోదైంది.

అటు రెవెన్యూ, ఇటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రికార్డుల్లో ఉన్నది. ఇటీవల ధరణి పోర్టల్ డేటాలో మాత్రం మార్పులు చేయడం గమనార్హం. ఏ ఆధారాలతో క్లాసిఫికేషన్ మార్చి పట్టా ల్యాండ్ చేశారో అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఇబ్రహింపట్నం తహశీల్దార్ ఎల్.రామ్మోహన్​ని కోరినా స్పందించడం లేదు. ఆర్డీవో ఈ వెంకటాచారి మాత్రం తహశీల్దార్ ని అడిగి చెప్తానని దాటవేశారు. చట్టబద్ధంగా మార్పు చేస్తే ఐజీఆర్ఎస్ వెబ్ సైట్ లోనూ మార్పు చేయాలి. కేవలం ధరణి పోర్టల్ లో మాత్రం అప్ డేట్ చేయడంలో ఆంతర్యమేమిటో అర్ధం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఉన్న కాలంలోనే జరిగింది.

ఇదెలా సాధ్యం?

– ఆదిబట్ల రెవెన్యూ సర్వే నం.44/ఆ లోని 10 ఎకరాలు ప్రభుత్వ భూమి. డీడీఎంఎస్ ట్రాన్సక్షన్ నం.2200899831 ద్వారా కళ్లెం లలిత పేరిట మారింది. గతేడాది అక్టోబరు 28న ఇబ్రహింపట్నం తహశీల్దార్/జాయింట్ సబ్ రిజిస్ట్రార్ చేశారు. ప్రభుత్వ భూమిగా ఉన్నది ఎవరు సంతకాలు పెట్టడం ద్వారా రికార్డులు మారాయో అంతుచిక్కడం లేదు.

– అదే భూమి 2022 డిసెంబరు 16న పల్లె మంజులకు డాక్యుమెంట్ నం.2796/2022 ద్వారా ఐదెకరాలను పట్టా చేశారు.

– 2022 డిసెంబరు 17న పల్లె గోపాల్ గౌడ్ కు డాక్యుమెంట్ నం.2797/2022 ద్వారా ఐదెకరాలను రిజిస్ట్రేషన్ చేశారు.

– స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ద్వారా ఆదిబట్ల సర్వే నం.44 లో ప్లాట్లుగా ఏమైనా క్రయ విక్రయాలు సాగాయా? అని సెర్చ్ చేస్తే 425 లావాదేవీలు చూపిస్తున్నాయి.

– అదే ఐజీఆర్ఎస్ వెబ్ సైట్ లో సర్వే నం.44లోని మొత్తం 13.26 ఎకరాల భూమిని 22ఎ కింద ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ గా పేర్కొనడం విశేషం. సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ కావడం వల్ల సెక్షన్ 22ఎ కింద లావాదేవీలను నిషేదిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రూ.వంద కోట్ల విలువ

ఆదిబట్ల సెజ్ పక్కనే ఉన్న ఈ సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ ని పట్టా భూమిగా మార్చేటప్పుడు ప్రభుత్వ అనుమతులు ఏ మేరకు తీసుకున్నారు? కేబినేట్ లో ఏమైనా తీర్మానించారా? రూ.వంద కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇంత కాలం సీలింగ్ సర్ ప్లస్ గా ఎలా రికార్డుల్లో పేర్కొన్నారు? ఇప్పుడెలా మార్పునకు అవకాశం లభించింది? రాజకీయ బలం కలిగిన వ్యక్తుల కోసమే అధికారులు చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధరణి డేటా మోడిఫికేషన్ సిస్టం(డీడీఎంఎస్) కింద కలెక్టర్ స్థాయిలోనే అన్ని పనులు పూర్తవుతుండడం గమనార్హం. ఆదిబట్ల ల్యాండ్ ఇష్యూలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్, తహశీల్దార్లు ఏ బేసిస్ లో రిపోర్ట్ ఇచ్చారో అంతుచిక్కడం లేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News