కాంగ్రెస్ అభ్యర్థిగా RRR.. ఖమ్మం క్యాండిడేట్‌పై వీడుతున్న పీటముడి
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సోమవారం బెంగళూరులో మల్లికార్జున్ ఖర్గేతో జరిగిన సమావేశంలో మంత్రులు భట్టి, పొంగులేటికి ఈ విషయం మీద స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభిప్రాయభేదాలకు తావు లేకుండా, పార్టీకి నష్టం జరగకుండా మధ్యే మార్గంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వెరసి ఇంతకాలం సస్పెన్స్‌కు గురి చేసిన ఖమ్మం సీటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొద్ది గంటల్లోనే అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి పేరును వెల్లడించనున్నట్లు తెలుస్తుంది.
దిశ, ఖమ్మం బ్యురో: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోమవారం బెంగళూరులో మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో జరిగిన సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయాలు సేకరించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల గడువు మరో రెండు రోజులే ఉండటం.. ఆ లోపు అభ్యర్థిని ప్రకటించడం అనివార్యం కావడంతో రామసహాయం వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోనే అధికారికంగా పార్టీ అధిష్టానం ఖమ్మం అభ్యర్థిని వెల్లడించే అవకాశం ఉంది.
ఖమ్మం హాట్ సీట్ కావడంతో..
ఖమ్మం పార్లమెంట్ హాట్ సీటు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు తప్పదనే నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఒకే సీటుపై ముగ్గురు మంత్రులు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానానికి అభ్యర్థి ఎంపిక కష్టతరమైంది. ఈ కారణం చేత ఆలస్యమవుతూ వస్తుంది. నామినేషన్ల స్వీకరణ దగ్గర పడుతుండటంతో ఈ విషయమై సత్వర పరిష్కారం దిశగా కాంగ్రెస్ అధిష్టానం మంత్రుల అభిప్రాయాలు సేకరించి రామసహాయం రఘురామ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
స్వస్థలం పాలేరు నియోజకవర్గమే..
రామసహాయం రాఘురామ్ రెడ్డి తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి, జయమాల దంపతులది కూసుమంచి మండలం చేగొమ్మ. 1961 డిసెంబర్ 19న రఘురామ్ రెడ్డి హైదరాబాద్‌లో జన్మించారు. నిజాం కళాశాలలో బీకామ్, అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వ్యాపార రీత్య హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన సురేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావులతో వీరి కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. రఘురామ్ రెడ్డికి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితను వివాహం చేసుకోగా.. చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి కుమార్తె సప్నిరెడ్డిని వివాహం చేసుకున్నారు.