ధరణి ప్రక్షాళనకు రంగం సిద్ధం.. అధికారాలు ఎవరికి?
ధరణి పోర్టల్‌తో నాలుగేండ్లుగా ఇబ్బందులు పడిన రైతులకు సాంత్వన చేకూర్చేందుకు ఎక్సర్ సైజ్ నడుస్తున్నది. సాంకేతిక వైఫల్యాలతో కూడిన ధరణికి చికిత్స మొదలుపెట్టేందుకు కమిటీ సమాయత్తం అవుతుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌తో నాలుగేండ్లుగా ఇబ్బందులు పడిన రైతులకు సాంత్వన చేకూర్చేందుకు ఎక్సర్ సైజ్ నడుస్తున్నది. సాంకేతిక వైఫల్యాలతో కూడిన ధరణికి చికిత్స మొదలుపెట్టేందుకు కమిటీ సమాయత్తం అవుతుంది. సోమవారం సీసీఎల్ఏ కేంద్రంగా సాగనున్న కమిటీ సభ్యుల మూడో మీటింగ్‌లో రూట్ మ్యాప్ రూపుదిద్దుకోనుంది. కనీసం రెండు నెలల పాటు కమిటీ, అందులోని సభ్యులు విడివిడిగా, ఉమ్మడిగా ఏమేం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ధరణి పోర్టల్, రెవెన్యూ రికార్డుల్లో అనేక తప్పిదాలు ఉన్నాయి. ఐతే అన్నింటిపైనా ఒకేసారి వర్క్ చేయడం ద్వారా విజయవంతమయ్యే అవకాశాలు లేవు. అందుకే ప్రాధాన్యతా క్రమంలోనే ముందుకు వెళ్తారు. ఒక్కొక్క అంశంపైన రిపోర్టు సమర్పించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్ ల్యాండ్స్ పై అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడు దఫాలుగా సాగిన అసైన్డ్ భూ పంపిణీలోనూ అనేక సమస్యలు తలెత్తాయి. నిన్న మొన్నటి వరకు కమిటీ ఈ పంపిణీ డేటా, సమస్యలపై చర్చించింది. ఇప్పటికే ఈ నాలుగేండ్ల ధరణి పోర్టల్, మాడ్యూళ్లు, వాటి పనితీరు, అప్లికేషన్ల స్వీకరణ, వాటి స్టేటస్‌పై ఇచ్చిన రిపోర్టును స్టడీ చేశారు. ఇంకా అదనపు సమాచారాన్ని కోరేందుకు కమిటీ సభ్యులు సిద్ధమైనట్లు తెలిసింది.
అభిప్రాయాల సేకరణ కష్టమే
ధరణి పోర్టల్ సమూల మార్పులపై ప్రజాభిప్రాయ సేకరణ కష్టంగా మారే అవకాశం ఉన్నది. లెక్క లేనన్ని డాక్యుమెంట్లు, అభిప్రాయాలు అందుతాయి. వాటితో పాటు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా పేరుకుపోయిన సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు వేలాది మంది బాధితులు వచ్చే అవకాశం ఉన్నది. అభిప్రాయాల కంటే సమస్యలను పరిష్కరించమంటూ వచ్చే వారి సంఖ్య అధికమవుతుంది. వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే పరిష్కరించలేదన్న అపవాదు కమిటీపై పడుతుంది. అభిప్రాయాలను ఓపెన్ గానే సేకరించాలా? కొందరు నిపుణులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అధికారులను కలిసి తీసుకోవాలన్న దానిపై చర్చ జరగనున్నది. నిపుణులు ఆర్వోఆర్ యాక్ట్ మార్పులు, చేర్పులపై నిర్ధిష్టమైన సలహాలు ఇస్తే బాగుంటుందని కమిటీ సభ్యుల యోచన. డ్రాఫ్ట్ పాలసీని తయారు చేసి సమర్పించినా బాగుంటుంది. సాంకేతిక నైపుణ్యం ఉంటే ధరణి పోర్టల్ స్థానంలో అమలు చేయబోయే వెబ్ ఎలా ఉండాలన్నది డిజైన్ చేసి ఇవ్వడం ద్వారా మెరుగైన భూ పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది.
అధికారాలు ఎవరికి?
- భూమాతను అమలు చేస్తే అధికార వికేంద్రీకరణ అనివార్యమని కమిటీ తేల్చేసింది. భూ సమస్యలకు పరిష్కార మార్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది. తహశీల్దార్ చేసే పనిని కూడా సీసీఎల్ఏకి అప్పగించింది. - సమస్యల పరిష్కారాలను కేటగిరీలుగా విభజించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేసే పనులను గుర్తిస్తారు. ఉదాహరణకు విరాసత్ గ్రామ స్థాయిలోనే పూర్తవుతుంది. వారసులెవరో ఆ ఊరిలోనే తేల్చేయొచ్చు. చిన్నచిన్న క్లరికల్ మిస్టేక్స్ మండల స్థాయిలోనే చేయొచ్చు. ఇలా అన్నింటినీ విడదీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భూమాతకు ముందే గ్రామ సభల ద్వారా రెవెన్యూ డేటాను సరిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారాన్ని చూపడం ద్వారానే మెరుగైన భూ పరిపాలన వ్యవస్థ ఏర్పడుతుందని విశ్వసిస్తున్నారు.
లీఫ్స్ సంస్థ ద్వారా సర్వే..
ధరణి కమిటీ సభ్యుడు ‘భూమి’ సునీల్ లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని 21 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అక్కడి భూ సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే యాచారం, మంతెనిగౌరెల్లి గ్రామాల్లో పూర్తయ్యింది. భూదాన్, అసైన్డ్ సమస్యలు అధికంగా ఉన్నట్లు తేలాయి. పాత రికార్డుల ఆధారంగానే క్లాసిఫికేషన్ ని డిసైడ్ చేయడం ద్వారా 50 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన భూములను కూడా ప్రభుత్వానివిగా ప్రకటించారు. భూదాన్ భూముల నిర్ధారణలో అధికారులకు క్లారిటీ లేదు. సర్వే నంబరులో కొంత భాగం భూదానంగా కనిపిస్తే ఆ మొత్తం విస్తీర్ణాన్ని బ్లాక్ చేశారు. అలాగే ఎండోమెంట్, వక్ఫ్, సీలింగ్ వంటివి కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పాసు పుస్తకాలు రాలేదంటూ తిరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నది.
సరళంగా రూపొందించిన దరఖాస్తు ఫారం ద్వారా రైతుల నుంచి సమస్యలను తెలుసుకుంటున్నారు. రెండు పేజీల్లో కేవలం 9 కాలమ్స్ తో అన్నింటినీ తెలుసుకునేట్లుగా తయారు చేశారు. వాటి ఆధారంగా భూ రికార్డుల పరిశీలన ఈజీగా చేసే అవకాశం ఏర్పడింది. ఇలాంటి నమూనాతోనే రాష్ట్ర వ్యాప్తంగా చేసి సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కారమయ్యే మార్గాలను రూపొందించే వీలుందని లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు భూమి సునీల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండానే తాము రైతుల నుంచి ఈ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే తమకొచ్చే దరఖాస్తులన్నింటికీ రిపోర్టు ఇస్తామన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి లీఫ్స్ కృషి చేస్తుందన్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు ధరణి పోర్టల్ సమూల మార్పులకు కూడా స్టడీగా తనకు ఉపయోగపడుతుందన్నారు.