కవితకు బెయిల్ ఇవ్వలేం.. కొడుకును చదివించడానికి బంధువులు ఉన్నారు కదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. ఎందుకు ఇవ్వదల్చుకోలేదో కూడా స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆ ఉత్తర్వుల్లో ఉదాహరణలతో సహా వివరించారు. మధ్యంతర బెయిల్‌పై కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్, స్పెషల్ పీపీ లేవనెత్తిన వాదనలను, కోర్టుకు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇంటెరిమ్ బెయిల్ ఇవ్వలేమని ఆ ఉత్తర్వుల్లో కావేరీ భవేజా క్లారిటీ ఇచ్చారు. చిన్న కొడుకు పరీక్షల నిమిత్తం బెయిల్ ఇవ్వాలన్న కవిత తరఫు వాదనలో కోర్టు సంతృప్తిచెందే అంశాలు లేవని స్పష్టం చేశారు. పెద్ద కొడుకు తన తల్లి మోరల్ సపోర్టు లేకుండా ఒంటరిగానే విదేశాల్లో చదువుకుంటున్నాడని, చిన్న కొడుకు సైతం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో కవిత సిస్టర్స్, బంధువులు అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45 నిబంధన చాలా అరుదైన సందర్భాల్లోనే కోర్టు తన విచక్షణతో బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటుందని, గతంలో ప్రీతి చంద్రా, సౌమ్యా చౌరాశియా కేసుల్లో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాలు ప్రస్తుతం కవిత విషయంలో వర్తించేలా లేవన్నారు. కవితకు బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్న అంశాలను కూడా ఆ ఉత్తర్వుల్లో కావేరీ భవేజా విపులంగా ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు గతంలో ఈడీ నోటీసులు జారీ చేసినప్పుడు మొబైల్ ఫోన్లు సహా డిజిటల్ ఎవిడెన్సులను మాయం చేయవద్దని స్పష్టంగా చెప్పినా నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేసినట్లు నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ గతేడాది మే నెలలో సమర్పించిన నివేదికలో పేర్కొన్నదని స్పెషల్ జడ్జి గుర్తుచేశారు. ఈడీ సమర్పించిన ఆధారాలను సైతం ఆమె ఉదహరించారు.
ఇక అప్రూవర్‌గా మారిన అరుణ్ పిళ్ళై అప్పటికే ఇచ్చిన స్టేట్‌మెంట్లను వెనక్కు తీసుకునేలా, వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయకుండా కవిత బెదిరించినట్లు ఈడీ పలు అంశాలను ప్రస్తావించిందని, వాటితో కోర్టు ఏకీభవిస్తున్నదని స్పెషల్ జడ్జి పేర్కొన్నారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో కవితకు బెయిల్ మంజూరు చేస్తే ఆధారాల ధ్వంసంతో పాటు నిందితులపై ఒత్తిడి తెచ్చి ప్రలోభపెట్టే అవకాశమున్నదన్న ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. చివరకు దర్యాప్తు ప్రక్రియకే విఘాతం కలుగుతుందని స్పెషల్ జడ్జి పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని, సౌత్ గ్రూపులో యాక్టివ్ సభ్యురాలిగా ఉన్నారని, ఈ గ్రూపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు ముట్టాయని, ఫలితంగా ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆమె బినామీగా ఉన్న అరుణ్ పిళ్లైకు వాటాలు వచ్చాయని... ఇలాంటివాటిని స్పెషల్ జడ్జి ప్రస్తావించి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత గతంలో ఎంపీగా ఉన్నారని, అనేక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం తరపున విదేశీ పర్యటనలు చేశారని, హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ చేయడంతో పాటు విదేశాల్లో పీజీ చేశారని, విద్యాధికురాలని, తెలంగాణ జాగృతి ద్వారా సామాజిక సేవా కార్యకలాపాల్లా యాక్టివ్‌గా ఉన్నారని.. ఇలాంటివాటిని ప్రస్తావించిన స్పెషల్ జడ్జి కావేరీ భవేజా... ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో ఆమె చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని, అవినీతి చోటుచేసుకోవడంలో ఆమె భాగస్వామిగా ఉన్నారని, కిక్ బ్యాక్ లాంటి కమిషన్ల విషయంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారని, వీటిని ధృవీకరించే ఆధారాలను కూడా ఈడీ ఈ కోర్టుకు సమర్పించిందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమె దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న జరగాల్సిన విచారణను ముందే చేపట్టాలని కోర్టుకు ఆమె తరఫు న్యాయవాది రిక్వెస్టు చేశారు. మరోవైపు జైల్లోనే కవితను విచారించడానికి సీబీఐ అధికారులకు ఈ కోర్టు ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనున్నది.