సిట్టింగ్‌ లకు రహ‘దారి’!.. కాసులకు కళ్ళు మూసుకుంటున్న అధికారులు

శంకరపట్నం మండలంలోని జాతీయ రహదారి పొడవునా, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం సిట్టింగులతో మద్యం ఏరులై పారుతుంది.

Update: 2024-09-09 03:05 GMT

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని జాతీయ రహదారి పొడవునా, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం సిట్టింగులతో మద్యం ఏరులై పారుతుంది. ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి ఉన్నవారు మాత్రమే మద్యం సిట్టింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ఒక్క హోటల్ యజమాని గానీ దాబా యజమానులు కానీ అనుమతులు పొందిన దాఖలాలు లేవు. అయినా అంటి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు. జాతీయ రహదారి పొడవునా భోజనశాలల్లో కూడా మద్యం అందుబాటులో ఉంటుంది. ఇష్టానుసారంగా అక్రమ మద్యం సిట్టింగులు వెలుస్తున్నా సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదని అపోహలు ఉన్నాయి. ఈ మధ్యనే ఓ దాబాపై పోలీసులు దాడి చేయగా అక్రమ సిట్టింగుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానీ గమ్మత్తు ఏంటంటే ఆ తతంగం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ అక్రమ సిట్టింగ్ వ్యవహారం మూడు ఆఫ్ బాటిల్లు ఆరు ఫుల్ బాటిళ్ల చందంగా కొనసాగుతుంది. తనిఖీలకు వచ్చిన అధికారులకు ఎంతో కొంత ముట్ట చెబుతూ తమ పని కానిస్తున్నారు. దాబాపై దాడులకు కూడా ఓ చిన్న కారణం ఉందని ఓ పోలీస్ బాస్ ఆగ్రహానికి గురైన దాబా నిర్వాహకుడు మూల్యం చెల్లించుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే చెప్పే అవసరం లేదు. ఒక్కో గ్రామంలో మూడు నుంచి నాలుగు బెల్టు షాపులు, అక్రమ సిట్టింగులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే ఏకంగా మందుబాబుల కోసం ప్రత్యేకంగా రేకుల షెడ్లు, పరదాలతో కట్టిన తాత్కాలిక రూంలు దర్శనమిస్తున్నాయి. రాత్రింబవళ్లు కొనసాగిస్తూ మందుబాబుల ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని బ్రష్టు పట్టిస్తున్నారు. అంటే బేరం ఏ స్థాయిలో నడుస్తుందో అధికారులు ఏ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారొ వీటిని చూస్తే అర్థమవుతుంది. అక్రమ సిట్టింగ్ లోనే చికెన్, మటన్ ఫ్రై చేయిస్తూ అర్ధరాత్రుల వరకు తాగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు ప్రధాన రహదారులపై ఇటు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ సిట్టింగులు, బెల్టు షాపులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కేవలం ముడుపులు ఇవ్వని వారిపై దాడులు చేసి మిగతా వారిని వదిలేస్తూ ఉన్నారనే అపోహలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రామాల్లో పోలీసులు గస్తీ తిరిగి అక్రమ సిట్టింగ్లపై బెల్టు షాపులపై కొరడా ఝలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Similar News