తెలంగాణలో అధికారులకు భట్టి విక్రమార్క కీలక సూచన
సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క రెవెన్యూ అధికారులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అనేక సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన భట్టి.. అధికార దుర్వినియోగం చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారు, ధరణిని అడ్డుపెట్టుకుని కొత్త ప్రభుత్వం ఏర్పడే లోపు ప్రస్తుతం ఉన్న ఆపధర్మ ప్రభుత్వం హైదరాబాద్ పరిసరాల్లోని అసైన్డ్ భూములను బీఆర్ఎస్ నేతల బినామీల పేర్లపైకి ట్రాన్స్‌ఫర్ చేసే కసరత్తు చేస్తోందని, గత నాలుగైదు రోజులుగా తమకు నచ్చిన కాంట్రాక్టులకు బిల్లులు రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ నేతలు చెప్పే అడ్డగోలు పనులు చేయవద్దని అధికారులకు సూచిస్తున్నామన్నారు. ప్రజలకు నష్టం జరిగే విషయం కావడంతో అడ్డగోలు వ్యవహారాలు జరగకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. అధికారులెవరు బీఆర్ఎస్ పెద్దల ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.
బీఆర్ఎస్ నేతల ఆగడాలపై అప్రమత్తమవ్వండి
కౌంటింగ్ సందర్భంగా పార్టీ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా గెలవలేదన్నట్లుగా ప్రకటించారని, ధర్మపురి, హుజూర్ నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి వంటి స్థానాలు అతితక్కువ ఓట్లతో సీట్లు కోల్పోయాయన్నారు. అధికారం కోల్పోతున్నా బీఆర్ఎస్ నేతలు ఎటువంటి ఆగడాలకైనా సిద్ధంగా ఉంటారని అందువల్ల కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు కోరుకుంటున్న మార్పు రాబోతున్నదని మార్పు కోరుకుంటున్న ప్రజలకు నష్టం జరిగే ఏ ఒక్క ప్రక్రియను కూడా ప్రస్తుత ప్రభుత్వ ఆగడాలను అడ్డుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు.