నాడు కేసీఆర్ వదిలిన భస్మాసుర బాణం.. నేడు తిరిగి బీఆర్ఎస్ మెడకు!

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యూహాలకు విపక్షాలు గిలగిల కొట్టుకున్నాయి.

Update: 2024-03-30 01:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యూహాలకు విపక్షాలు గిలగిల కొట్టుకున్నాయి. ఆయన ఎప్పుడు ఏ పార్టీని ఎటాక్ చేస్తాడనే విషయం చివరి నిమిషం వరకు ఎవరికీ తెలిసేది కాదు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వలసలను ఎంకరేజ్ చేయడం వల్ల విపక్షాలు ఖాళీ అయ్యాయి. ఆయన రాజకీయ చతురత కారణంగా కొన్ని పార్టీలు కనుమరుగవగా, ఇంకొన్ని పార్టీలు బలహీనపడ్డాయి. సరిగ్గా ఇప్పుడు సీఎం రేవంత్ సైతం అలాంటి వ్యూహాలనే అమలు చేస్తుండటంతో, కేసీఆర్ విలవిలలాడుతున్నాడనే టాక్ వినిపిస్తున్నది. గులాబీబాస్‌కు సన్నిహితంగా ఉన్న లీడర్లు సైతం పార్టీ మారుతున్నారు. భవిష్యత్‌లో ఈ వలసలు ఇలాగే కొనసాగితే, బీఆర్ఎస్‌లో లీడర్లు మిగులుతారా? అనే సందేహాలు ఆపార్టీ కేడర్‌లో వ్యక్తమవుతున్నాయి.

అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్..

బీఆర్ఎస్ పవర్‌లో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ పార్టీలను బలహీన పరిచేందుకు కేసీఆర్ అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు రేవంత్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నాడు విపక్ష లీడర్ల బలహీనతలను గుర్తించి, వాటిపై కేసీఆర్ గురిపెట్టడంతో ఆయా పార్టీల నేతలు గులాబీ కండువాలను కప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ లీడర్ల బలహీనతలను గుర్తించి, సంప్రదింపులు జరపుతున్నట్టు తెలుస్తున్నది. పార్టీలో చేరితే వచ్చే రాజకీయ ప్రయోజనాలపై స్పష్టమైన హామీలు ఇస్తున్నట్టు టాక్. దీనితో ఘర్ వాపస్ పేరుతో కొందరు, గులాబీ పార్టీలో ఇమడిలేమనే కారణంతో ఇంకొందరు కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. లోకసభ ఎన్నికలు పూర్తయ్యే నాటికి బీఆర్ఎస్ లీడర్లను లాగేయ్యాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. అందుకోసం ప్రస్తుతం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ, పార్టీలో చేరితే ఉండే రాజకీయ భవిష్యత్‌పై హామీలు ఇస్తున్నది.

చివరి వరకూ సస్పెన్స్

బీఆర్ఎస్ లీడర్లతో చర్చలు పూర్తయ్యే వరకూ విషయం బయటకు పొక్కకుండా, సొంత పార్టీలోని లీడర్లకు సైతం తెలియకుండా సైలెంట్‌గా కాంగ్రెస్ పని పూర్తి చేస్తున్నది. ముందుగా విషయం బయటికి వస్తే, కేసీఆర్ అలర్ట్ అయ్యే చాన్స్ ఉంటుందని కారణంతో విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. రాజ్యసభ ఎంపీ కేకే, తన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని వెంటాబెట్టుకుని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. తమ ఫ్యామిలీ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రెడీ అయ్యామని చెప్పి బయటకు వచ్చారు. ఈ విషయాన్ని కేసీఆర్ జీర్ణించుకునేందుకు సమయం ఇవ్వకుండా అదే రోజు సాయంత్రం కాంగ్రస్ మరో షాక్ ఇచ్చింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్యతో తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు హస్తం పార్టీ ప్రకటన ఇప్పించింది.

కేసీఆర్ సన్నిహితులే టార్గెట్

కేసీఆర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో వలసలను ఎంకరేజ్ చేస్తుందనే చర్చ జరుగుతున్నది. వెన్నంటే ఉంటున్న లీడర్లు పార్టీ మారితే ఏ నాయకుడైనా జీర్ణించుకోలేడు. ఆందుకే కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తులైన లీడర్లపైనే కాంగ్రెస్ గురిపెట్టి, ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటున్నది. కేసీఆర్‌కు ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రంజిత్‌రెడ్డి అత్యంత సన్నిహితులనే ముద్ర ఉంది. గులాబీ పార్టీలోకి వచ్చిన కేకేకు కేసీఆర్ సరైన ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ సెక్రటరీ జనరల్ పోస్టు ఇవ్వడంతో పాటు, రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా చాన్స్ ఇచ్చారు. ఆయన కొడుకుకు నామినేటేడ్ పదవి, కూతురుకు జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కట్టబెట్టారు. 2018లో ఎంపీగా ఎన్నికైన కడియం శ్రీహరిని హఠాత్తుగా డిప్యూటీ సీఎం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యను పక్కనపెట్టి, కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాతే పార్టీ మారడం పెద్ద అవమానంగా బీఆర్ఎస్ లీడర్లు ఫీలవుతున్నారు. 2009లో ఎంపీ టికెట్ ఇచ్చి రాజకీయాలను పరిచయం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఎంపీ రంజిత్ రెడ్డి పక్కనపెట్టారు. ఈ మధ్యే కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ టికెట్ పై పోటీ చేస్తున్నారు.

పార్టీ మనుగడపై సందేహాలు

బీఆర్ఎస్ నుంచి వరుసగా వలసలు కంటిన్యూ అవుతుండటంతో ఆ పార్టీ కేడర్‌లో ఆందోళన మొదలైంది. ఈ వలసలు ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్ ఏంటీ? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారగా, మరో ఎమ్మెల్యే కడియం క్యూ కట్టారు. త్వరలో మరికొంత మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారనే, కాంగ్రెస్ లీడర్లు పదే పదే ప్రకటిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఫ్యామిలీ మినహా, కొనసాగే ఎమ్మెల్యేలు ఎవరు? అని ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News