ఆ విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్:ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో:ఎన్నికలకు ముందు రైతులను మభ్య పెట్టి రేవంత్ రెడ్డి ఓట్లు దండుకున్నారని తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఆ రైతులను విస్మరించడంలో సక్సెస్ అయ్యారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులపై రేవంత్ రెడ్డి పూర్తిగా నిర్లక్షం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. పంట బోనస్ దేవుడెరుగు కనీసం రాష్ట్రంలో ఇంకా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. రైతులను మోసం చేయడంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోయారన్నారు. రైతురుణ మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కార్పొరేషన్ ద్వారా అప్పుల తెచ్చి రుణ మాఫీ చేయడం కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ కోసం నిధులు ఎట్లా సమకూర్చుకుంటారో రేవంత్ రెడ్డికి ఒక స్పష్టత లేదని రైతు రుణ మాఫీపై కార్యచరణ ఎంటో ముఖ్యమంత్రి చెప్పాలని, రాష్ట్ర సమస్యలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కరెంట్ కోతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో సబ్ స్టేషన్లను సందర్శించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను కాపాడుతున్నారని ఆరోపించారు. ఓటింగ్ సరళి చూస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ బలమైన ఫెవికాల్ బంధం ఉందని అర్థమవుతోందన్నారు. తాము అనుకున్న పార్లమెంట్ స్థానాలు సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.