CM రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు.. ఆప్ MP సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల జైలు నుంచి విడుదల అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-05 05:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల జైలు నుంచి విడుదల అయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన మాట్లాడుతూ.. చీఫ్ మినిస్టర్‌ను అరెస్ట్ చేయడం ద్వారా దేశంలో ఇక ప్రజాస్వామ్యం లేదన్నారు. తదుపరి బీజేపీ తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లను సైతం అరెస్ట్ చేసి వారిని రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తుందన్నారు. దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలని ఇతర పార్టీలు ఉండకూడదనే చర్య సరికాదన్నారు.

రెండు తప్పుడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి రాజీనామా చేయాలని అడుగుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై మండిపడ్డారు. ఈ ట్రెండ్ ప్రజాతీర్పునకు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. త్వరలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సంత్యేంద్ర జైన్ విడుదల అవుతారన్నారు. ప్రజల కోసం పనిచేసే కేజ్రీవాల్‌ను బీజేపీ ఆపలేదన్నారు. ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న నియంతృత్వ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా ఉద్యమం నుంచి పుట్టిందని గుర్తుంచుకోవాలన్నారు. ధరల పెరుగుదల, రైతుల అంశాలు, మణిపూర్ హింస వంటి తీవ్ర చర్యలు వ్యతిరేకంగా తాము గొంతు విప్పుతూనే ఉన్నామన్నారు.

Tags:    

Similar News