గుర్తుపెట్టుకో బిడ్డా.. 80 కంటే ఎక్కువే వస్తాయి: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవితను ఓడించినప్పటి నుంచి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.

Update: 2023-11-22 10:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కవితను ఓడించినప్పటి నుంచి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఈ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయలేదని, షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించలేదని, పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ బక్క పలుచని వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నాడని వందల కోట్లు, వేల ఎకరాలు దోచుకునేటప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లు పోటీ పడతారని ప్రజలకు సేవా చేయాలన్నప్పుడు మాత్రం కేసీఆర్ బక్క పలుచని వాడు, కేటీఆర్ తిరుగుబోతు అవుతున్నాడని విమర్శించారు.

బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదవి పోతుందన్న భయంతో కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని అంటున్నాడని.. నిజామాబాద్ రూరల్ గడ్డ మీది నుంచి సూటిగా సవాల్ చేస్తున్నా.. గుర్తుపెట్టుకో బిడ్డా.. కాంగ్రెస్‌కు 80 సీట్ల కంటే ఎక్కువే రాబోతున్నాయి. డిసెంబర్ 3వ తేదీన లెక్కపెట్టుకోవాలని ఛాలెంజ్ చేశారు.

మీసమున్న మొగోడివే అయితే ఛాలెంజ్ స్వీకరించు:

కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యంపై మాట్లాడుతున్నాడని.. బరాబర్ ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్నారు. మేము కట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చూపించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని.. కేసీఆర్ మేడిగడ్డను చూపించి ఓట్లు అడగాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ మూతిమీదున్న మీసాలున్న మొనగాడివే అయితే ఈ ఛాలెంజ్‌కు అంగీకరించాలన్నారు. రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారన్నారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్లను బాగుచేసే రాజ్యం అని.. బీఆర్ఎస్ పాలన అంటే దొరలు, దోపీడి, కమీషన్లు, ఇసుక దొంగల రాజ్యం అన్నారు. చివరకు ఆడబిడ్డల మెడల్లో ఉన్న తాళిబొట్లను లాక్కుంటున్న దోపిడిదొంగల రాజ్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారెంటీలతో పాటు పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ ఉంటే 2 వేలే పింఛన్ ఇస్తారని అదే కేసీఆర్‌ను బొంద పెడితే ఇందిరమ్మ రాజ్యంలో 4 వేల పింఛన్ ఇస్తామన్నారు.

బోధన్ ఏసీపీ గుర్తుపెట్టుకో..:

బోధన్ ఏసీపీ తన విధులు తాను చేసుకోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవవహరిస్తే డిసెంబర్ 9 తర్వాత ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలన్నారు. మా కార్యకర్తలను ఏసీపీ కొడుతున్నాడని మా నాయకులు చెబుతున్నారని ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. మా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు మా నాయకులు రెడ్ డైరీలో రాసుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరో ఆలోచన చేసుకోవాలని హెచ్చరించారు.

Tags:    

Similar News