పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి.. చిక్కు నుంచి బయటపడతారా?

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ సందిగ్థంలో పడింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు పార్టీని

Update: 2022-03-12 23:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ సందిగ్థంలో పడింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు పార్టీని రోడ్డున నిలబెట్టాయి. రాష్ట్రంలో తమకు అనుకూల పరిస్థితి వస్తుందని భావిస్తున్న సమయంలోనే గడ్డు పరిస్థితులు మళ్లీ ముందుకొచ్చాయి. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఘోరంగా దెబ్బతినడం రాష్ట్రంలోనూ ఇబ్బందికర పరిణామాలను తీసుకువచ్చాయి. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్​లో అంతర్గత గొడవలు రచ్చకెక్కాయి. వివాదాలు ఢిల్లీని తాకాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటి నుంచీ పార్టీని బయటపడేయడమే కాదు.. నేతల్లోనూ భరోసా నింపడం టీపీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి ముందున్న ప్రధాన లక్ష్యంగా మారింది. ఓవైపు సొంత నేతల తిరుగుబాట్లు, వ్యతిరేక విమర్శలు, ప్రతి మాటకు అడ్డు చెప్పుతుండటం, మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అటు బీజేపీ స్పీడ్​ను అడ్డుకోవడం, టీఆర్​ఎస్​ వ్యూహాలను దెబ్బకొట్టుతూ ఇటు పార్టీ నేతలను కాపాడుకోవడం.. ఇలా రేవంత్​రెడ్డి రాజకీయ పద్మవ్యూహంలో చిక్కారు.

బలమని భావించే డైవర్ట్​

రాష్ట్ర అధికార పార్టీ ఇటీవల కాలంలో కాంగ్రెస్​నే బలమైన ప్రతిపక్షంగా భావిస్తున్నట్లు పలు సందర్భాల్లో వెల్లడైంది. కానీ, గులాబీ అధినేత కేసీఆర్​.. కాంగ్రెస్​పై ఫోకల్​ వెళ్లకుండా చేసేందుకు బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా ముందుకు తీసుకువచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూనే ఉన్నారు. గ్రామస్థాయి నుంచి బలంగా ఉన్న కాంగ్రెస్​కు అవకాశం వస్తే తిరిగి కిందిస్థాయి నుంచి బలం పెంచుకుంటుందనే భయం ముందు నుంచే ఉంది. అందుకే ప్రతి సమయం, సందర్భంలోనూ బీజేపీని తెరపైకి తీసుకువస్తూ, కాంగ్రెస్​ టార్గెట్​ కాదనే సంకేతాలిచ్చేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ, గత కొంతకాలంగా కేసీఆర్​ ఊహించినదానికంటే భిన్నంగా కాంగ్రెస్​కు జోష్​ వస్తోంది. రేవంత్​ సారథ్యంలో కొంత దూకుడు పెంచినట్లు కనిపించింది. అయినా కాంగ్రెస్​ను పట్టించుకోవడం లేదనే తీరుతో వ్యవహరించినా.. అంతిమంగా ఆ పార్టీని తెరపైకి రాకుండా చేయడమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించారు. ఒక దశంలో హస్తం పార్టీలో విభేదాలకు కూడా కేసీఆర్​ కారణమనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. ఒక వర్గాన్ని రేవంత్​పైకి ఉసిగొల్పడంలో కేసీఆర్​ సక్సెస్​ అవుతున్నారంటూ రాజకీయవర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు కీలకం

ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్​కు కష్టకాలం తీసుకువచ్చింది. ఓవైపు పార్టీలో అంతర్యుద్ధం జోరుగా సాగుతోంది. ఒకరి వెంట ఒకరు.. సీనియర్లు రేవంత్​ తీరును తప్పు పడుతూనే ఉన్నారు. సీనియర్ల వ్యతిరేకతను పట్టించుకోనట్టుగానే టీపీసీసీ చీఫ్​ వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ శ్రేణులపై కొంత ప్రభావం చూపిస్తూనే ఉంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడు దూసుకుపోతున్నట్లుగా మారింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్​ నేతలు కూడా బీజేపీ వైపు చూసే పరిస్థితి నెలకొంది. అటు బీజేపీ కూడా నేతలెవ్వరైనా రావచ్చు అనే సంకేతాలిస్తోంది. దీంతో ఇతర పార్టీలో నుంచి వలసలు పెరుగుతాయనే భావిస్తున్నారు. బీజేపీ జోష్​ కనిపిస్తున్నా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో మాత్రం కొంత వెలితి ఉంటోంది. దాన్ని ఇప్పుడు ఇతర పార్టీల నేతల రూపంలో సరిదిద్దుకోవాలని ప్లాన్​ వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలను కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్​పై ప్రధానంగా ఉంటోంది. ఇక ఇటీవల రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్​ మెంబర్​ షిప్​ చేసినట్లు టీపీసీసీ ప్రకటించింది. ఏఐసీసీ కూడా అభినందించింది. ఇదే సమయంలో కాంగ్రెస్​ వ్యూహకర్తతో పాటుగా పార్టీ నాయకత్వం వన్​ ప్లస్​ వన్​ ఫార్ములాను అమలు చేయాలని భావించింది. డిజిటల్​ మెంబర్​షిప్​ తీసుకున్న ప్రతి ఒక్కరు వారితో పాటుగా మరో ఓటును వేయిస్తే చాలు.. అధికారం మనదే అనే భావనతో ఉంది. అయితే ఇప్పుడు ఈ 40 లక్షల మెంబర్​షిప్​ను పదిలం చేసుకోవడం కూడా పెద్ద టాస్క్​గా మారింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంలో పడిందనే విశ్లేషణలు జరుగుతున్నాయి. అటు టీఆర్​ఎస్​ కూడా బీజేపీని ముందు పెడుతోంది. దీంతో రేవంత్​ టీం కొంత సందిగ్థంలో కొట్టుమిట్టాడుతోంది. చుట్టూ వలయంగా మారిన ఈ పరిస్థితుల నుంచి పార్టీని ముందుకు తీసుకుపోవడమే కాదు.. నిన్నటి దాకా అధికారం మనదే అంటూ చేస్తున్న వ్యాఖ్యలను కంటిన్యూ చేయాలంటే ఎలాంటి వ్యూహాలు వేయాలో రేవంత్​ ముందున్న అతి పెద్ద సవాల్​గా మారింది. అటు బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తూనే.. ఇటు టీఆర్​ఎస్​ నుంచి ప్రతిదాడిని అడ్డుకుంటూ పార్టీలో మళ్లీ జోష్​ తీసుకురావాల్సి ఉంటోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయం మేమే అనే సంకేతాలిచ్చి, అధికార పార్టీకి ఎదురు నిలువాలనే లక్ష్యం రేవంత్​ ముందు ఉంది.

దూకుడుగా వెళ్లాల్సిందే

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​కు కష్టకాలమే అంటున్న రాజకీయ విశ్లేషకులు.. మరోవైపు అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలను పట్టించుకోకుండానే.. తనదైన శైలిలో దూసుకుపోవడం, తన వర్గాన్ని మరింత స్పీడ్​ చేయడంతో పాటు బీజేపీ, టీఆర్​ఎస్​పై ఎదురుదాడి మొదలుపెట్టాల్సి ఉంటుందంటున్నారు. కానీ, ఏఐసీసీ నుంచి రేవంత్​ బృందానికి ఎంత మేరకు పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందో తేలాల్సిన సమయం ఇదేనని, ఏఐసీసీ నుంచి రాష్ట్రానికి సంబంధించిన పూర్తిస్థాయి పగ్గాలు ఇస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొంత సానుకూలత వచ్చే అవకాశం కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News