‘రేవంత్ అన్నా.. ఈ పని చేసిపెట్టండి’ ముఖ్యమంత్రి ట్వీట్ కు నెటిజన్ విజ్ఞప్తి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నెటిజన్లు ఆసక్తికర విజ్ఞప్తులు చేశారు.

Update: 2024-05-12 11:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారం ముగియడంతో రేపటి నుండి తానేం చేయబోతున్నానో అనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్ బాల్ పోటీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడి అందరినీ అలరించారు. విద్యార్థులతో కలిసి తాను ఫుట్ బాల్ ఆడిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన రేవంత్ రెడ్డి.. 'నిన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. ఇక రేపటి నుంచి మళ్లీ ప్రజాసేవకు సిద్ధం అవుతుండగా సెంట్రల్ యూనివర్సిటీ గ్రౌండ్ లో యువ ఆటగాళ్లతో కలిసి పుట్ బాల్ ఆడటం జరిగింది. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ యువత భారత పతాకాన్ని ఎగురవేయడానికి ప్రోత్సహిస్తాం' అంటూ ట్వీట్ చేశారు.

రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఫ్లెయింగ్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. క్రీడలపై మీరు చూపిస్తున్న ప్యాషన్ తెలంగాణ యువకులకు గొప్ప సందేశం ఇస్తోంది. మీరు తరచూగా ప్లే గ్రౌండ్ లో చూడటానికి ఇష్టపడుతున్నాం అని ఓ నెటిజన్ రియాక్ట్ కాగా మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ 'రేవంత్ అన్న.. ఇంగ్లండ్ లో ఉన్న సిటీ ఆఫ్ మాంచెస్టర్ స్టేడియం (ఎతిహాద్ స్టేడియం) కు సమాంతరంగా హైదరాబాద్ లో ఓ ఫుట్ బాల్ స్టేడియం నిర్మించేందుకు చొరవ తీసుకోండి. ఈ స్టేడియం ఛాంపియన్స్ లీగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిర్మించండి. అలాగే భవిష్యత్ ఎక్కువ మంది పాఠశాలల పిల్లలను ఫుట్ బాల్ ఆడేలా ప్రోత్సహించండి. యోగా విషయంలో నరేంద్ర మోడీ ప్రపంచానికి ఎలా మార్గదర్శకంగా నిలిచారో మీరు కూడా భవిష్యత్ చిన్నారులకు స్పూర్తిదాయకంగా ఉంటారు అని కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ ప్రస్తుతం పిల్లల్లో ఫుట్‌బాల్ పై క్రేజ్ విపరీతంగా ఉంది. అయితే ఫుట్‌బాల్ ప్లేగ్రౌండ్‌లు/అకాడెమీలు చాలా తక్కువగా ఉన్నాయి. మంచి కోచ్‌లతో అన్ని రకాల క్రీడలతో కూడిన అనేక మైదానాలను నిర్మించాలని కోరారు.

Tags:    

Similar News