రేవంత్ రెడ్డి చౌకబారు రాజకీయాలు బంజెయ్.. కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
పుల్వామా, సర్జికల్ స్ట్రైక్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో:దేశ అంతర్గత భద్రత కేంద్రం బాధ్యత.. దానిని నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలం అయ్యారని పుల్వామా ఘటనతో తేలిపోయిందని, అసలు పుల్వామా ఘటన జరుగుతుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, రా వంటి ఏజెన్సీలు ఏం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మరోసారి కాంగ్రెస్ మన వీర సాయుధ దళాలను, జవాన్లను అవమానించిందని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు శనివారం ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి.. జాతీయ భద్రతపై బుజ్జగింపుల రాజకీయాలు నడపడమే కాంగ్రెస్ విధానం అని దుయ్యబట్టారు. 26/11 ముంబై దాడుల నుండి హైదరాబాద్ వరుస పేలుళ్ల వరకు, అలాగే జమ్మూ కాశ్మీర్‌లో పౌరులు, సైనికులపై దాడులు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. వీటికి ఆ సమయంలో అధికారంలో ఉన్న యూపీఏ హయాంలోని ఇంటెలిజెన్స్ వైఫల్యాలే అందామా? ఆ ఘటనలకు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను బాధ్యులను చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. 'జై శ్రీరాం' అనే నినాదాలు చేయడం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా ఉండవచ్చు కానీ 140 కోట్ల మంది భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఫైర్ అయ్యారు. ఇకనైనా రేవంత్ రెడ్డి చౌకబారు రాజకీయాలు చేయడం మానేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు. కాగా నిన్న జరిగిన మీట్ ది ప్రెస్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పుల్వామా కేంద్రంలోని నరేంద్ర మోడీ వైఫల్యమేనని, సర్జికల్ స్ట్రైక్ జరిగిందో లేదో ఆ భగవంతుడికే తెలుసు, కానీ ఆ పేరు చెప్పి బీజేపీ పొలిటికల్ గా మైలేజ్ సంపాదించుకుందని ఆరోపించారు. కేంద్రాన్ని ఏమైనా ప్రశ్నిస్తే జై శ్రీరాం అంటోందని, చెప్పుకోవడానికి చేసిన పనులు ఏమీ లేకనే బీజేపీ దేవుడిని రాజకీయాల్లోకి లాగుతోందని వ్యాఖ్యానించారు.