supreme court: ఎమ్మెల్సీల నియామక అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట

ఎమ్మెల్సీ నియామక అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Update: 2024-08-14 07:29 GMT

దిశ, తెలంగాణ/డైనమిక్ బ్యూరో:  గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామక అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాజాగా సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలని పిటిషన్లు కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని, ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం పేర్కొంది. కాగా తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్‌ కోటాలో ఎంపిక చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం పిటిషన్‌పై విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. కాగా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను రాష్ట్ర కేబినెట్ ఇటీవలే మరోసారి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Tags:    

Similar News