BRS ‘స్వేదపత్రం’ విడుదల.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం విడుదల చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం విడుదల చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పారు. గత పాలకులు ఉద్దేశపూర్వకంగా జీవన విధ్వంసం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అసహనానికి గురయ్యారు. గతంలో ఏటా పాలమూరు నుంచి 14 లక్షల మంది వలసవెళ్లే వారని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్‌ను బద్నాం చేస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వం చేసిన ఆరోపణలకు, విమర్శలకు తాము కూడా ధీటుగా సమధానం చెప్పారని అన్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకంగా సభనే వాయిదా వేశారని ఎద్దేవా చేశారు. అందుకే గత పదేళ్లలో ఏం చేశామో.. బాధ్యతగల పార్టీగా ‘స్వేదపత్రం’ విడుదల చేస్తున్నామని చెప్పారు. కోట్లమంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే స్వేదపత్రం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.