రీజనల్ రింగ్ రోడ్డుతో గ్రామాల రూపు రేఖలు మారతాయి : మంత్రి శ్రీధర్ బాబు

రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలను తెలంగాణా కోర్ అర్బన్ రీజియన్ గా అభివృద్ధి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

Update: 2024-08-22 17:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలను తెలంగాణా కోర్ అర్బన్ రీజియన్ గా అభివృద్ధి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు లోపల, జీహెచ్ఎంసీ, శివారు మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల అంచున ఉన్న గ్రామ పంచాయతీలన్నిటిని పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. సిటీ, శివారు మున్సిపాలిటీ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న 23 గ్రామ పంచాయతీల విలీనం, పునర్వవస్థీకరణపై మార్గదర్శకాలు రూపొందించేందుకు భేటీ అయ్యారు. పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... గ్రామపంచాయతీలను పునర్వవస్థీకరించడం వల్ల గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. పారిశ్రామిక క్లస్టర్లు వస్తాయని, మౌలిక వసతుల పరంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుల మధ్య లింక్ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. దీని వల్ల కనెక్టివిటీ పెరిగి గ్రామాల రూపురేఖలు మారిపోతాయని వివరించారు. సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు అక్బరుద్ధీన్ ఒవైసీ, గూడెం మహిపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పట్టణాభి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 


Similar News