ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ఇక వాళ్లకి చుక్కలే..!

Update: 2024-09-21 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత కొంతకాలంగా స్తబ్దుగా ఉండిపోయిన ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఊహించని మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ హెడ్ శ్రవణ్‌రావు చిక్కలేదు. ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన టైమ్‌లో కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలిసి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాల్సిందిగా కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలతో పాటు వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా జరిగే దర్యాప్తు ప్రక్రియను వివరించారు. అప్పట్లో సానుకూలంగానే స్పందించిన సీబీఐ బ్లూ కార్నర్ నోటీసు జారీచేసింది. తాజాగా వారికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా ఇంటర్ పోల్ విభాగానికి సీబీఐ డైరెక్టర్ లేఖ రాశారు. ఆ సంస్థ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యే అవకాశమున్నట్లు ఢిల్లీలోని సీబీఐ వర్గాల సమాచారం.

ఇంటర్‌పోల్ సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీచేస్తే ఏ దేశంలో ఉన్నా అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే అధికారం లభిస్తుంది. ఇంటర్‌ పోల్ సంస్థ నోటీసు దాదాపు 196 దేశాల్లోని పో లీసు విభాగాలకు వర్తిస్తుంది. ఈ నోటీసు ఆధారంగా అక్కడి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారి స్వదేశానికి (డీపోర్టింగ్) పంపించవచ్చు. ఒకవేళ ఆ ఇద్దరు ఈ రెడ్ కార్నర్ నోటీసులతో విభేదించినట్లయితే అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది. అక్కడి కోర్టులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పోలీసు విభాగం స్వదేశానికి పంపడంపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకూ బ్లూ కార్నర్ నోటీసు మాత్రమే అమల్లో ఉండడంతో వీరిద్దరిని స్వదేశానికి రప్పించడంలో స్టేట్ పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెడ్ కార్నర్ నోటీసు జారీచేస్తే వారిని అదుపులోకి తీసుకోడానికి మార్గం సుగమమవుతుంది. ఇప్పటివరకూ వీరు పోలీసులకు చిక్కకపోవడంతో దర్యాప్తు ప్రక్రియ అర్ధంతరంగా పెండింగ్‌లో పడింది. వీరిని రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసినా చివరకు రెడ్ కా ర్నర్ నోటీసుపైనే ఆశలు పెట్టుకున్నారు.

ప్రభాకర్‌రావు అమెరికాలో, శ్రవణ్‌రావు లండన్‌లో ఉన్నట్లు రాష్ట్ర పోలీసుల అనుమానం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన డీఎస్పీ ప్రణీత్‌రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు, డీసీపీ భుజంగరావు, తిరుపతన్న తదితరులను అరెస్టు చేసి వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్‌కు ప్రభాకర్‌రావు ఆదేశాలు ఇ చ్చారని, ఉన్నతాధికారిగా ఆయన ఉత్తర్వులను అ మలు చేయక తప్పలేదని వీరు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంభాషణలను విని ప్రతిపక్ష నేతల కదలికలను పసి గట్టి నియంత్రించామని, వారి ఆర్థిక మూలాలను అరికట్టామని స్టేట్‌మెంట్లలో పేర్కొన్నారు. ప్రభా కర్‌రావు ఆదేశాల మేరకే వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్‌ సంభాషణలను ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్‌కు ఫండింగ్ చేయించామనీ పేర్కొన్నారు. ఇంటర్‌పోల్ జారీ చేసే రెడ్ కార్ నోటీసుపై ఉత్కంఠగా ఉన్న రాష్ట్ర పోలీసులు వారిని అప్పగిస్తే పూర్తి వివరాలను రాబట్టి దర్యాప్తును వేగవంతం చేయొచ్చని భావిస్తున్నారు.


Similar News