టీ- బీజేపీలో ‘రెబల్’ గ్రూపు.. హైదరాబాద్‌లో రహస్యంగా భేటీ అయిన 10 మంది కీలక నేతలు..!

బీజేపీలో రెబల్ గ్రూప్ ఏర్పాటైంది. పలువురు నేతల తీరు నచ్చక మరికొందరు నేతలు ఒక్కటయ్యారు. రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా దాదాపు పది మంది నేతలు రహస్యంగా భేటీ

Update: 2023-09-21 00:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో రెబల్ గ్రూప్ ఏర్పాటైంది. పలువురు నేతల తీరు నచ్చక మరికొందరు నేతలు ఒక్కటయ్యారు. రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా దాదాపు పది మంది నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆ భేటీలో వారు చర్చించారు. పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. పార్టీలో కొందరికే ప్రాధాన్యత ఇస్తుండటంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో తమకు ప్రియారిటీ దక్కకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసుపై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే చర్చ ప్రజల్లో జరుగుతోంది. అయితే రహస్యంగా భేటీ అయిన నేతలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకే అప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌పై ఫైట్ చేయడంలో బీజేపీ స్లో అవ్వడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీకొట్టాలని వచ్చిన వారి లక్ష్యం నెరవేరకపోవడంతో పది మంది నేతలు గుర్రుగా ఉన్నారు.

హైదరాబాద్ విమోచన వేడుకలు సైతం అసంతృప్తుల ఆగ్రహావేశాలకు ఒక కారణంగా మారింది. ఈనెల 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అదేరోజు ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో భేటీ కావాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో అది రద్దయింది. కేవలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో మాత్రమే సమావేశం నిర్వహించారు.

అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని, జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ని పిలవడం ఓకే, కానీ.. ఈటలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారని నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ను ప్రెసిడెంట్‌గా తొలగించడంపైనా చర్చలోకి వచ్చినట్లు సమాచారం. బండిని తొలగించిన సమయంలో అందరూ కలిసికట్టుగా ఉంటే ఇతర నేతలకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చర్చలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

దీనికి తోడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీరుపై కూడా ఆ పది మంది నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో చేరికల విషయంలో స్థానిక, పలువురు సీనియర్ నేతలతో సంప్రదింపులు జరపకుండానే ఈటల చేర్చుకుంటున్నారని వారు ఆరోపించినట్లు తెలుస్తోంది. ఒంటెత్తుపోకడ పోతున్నారని ఈటల తీరుపై వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ములుగు నుంచి మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో చేరారు.

అయితే ఆ చేరికపై నేతలు గుర్రుగా ఉన్నారు. అలాగే సంగారెడ్డిలో పులిమామిడి రాజు బీజేపీలో చేరికపై కూడా నేతలు అసంతృప్తితో ఉన్నారు. తమతో కనీసం మాట కూడా చెప్పకుండా, సంప్రదించకుండానే ఏకపక్షంగా వారిని పార్టీలో చేర్చుకున్నారని ఈటల రాజేందర్‌పై బీజేపీ నియోజకవర్గ ఇన్ చార్జీలు ఆగ్రహంతో ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండానే ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీలో ఆహ్వానిస్తుండటంతో తమకు ఇబ్బందిగా ఉందని మండిపడుతున్నారు. ఇలా చేస్తే తమకు కార్యకర్తల్లో ఏం గౌరవం ఉంటుందని పలువురు నేతలు వారి వారి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్.. అభ్యర్థుల ప్రకటన, డిక్లరేషన్లు, గ్యారంటీలు, నియోజకవర్గాల్లో ప్రచారంతో దూసుకుపోతుంటే బీజేపీ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా మారింది. అయితే పార్లమెంట్ సమావేశాల అనంతరం ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి పలు అంశాలపై చర్చించాలని రహస్య భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి హైకమాండ్ దీన్ని ఎలా తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News