548 ఇల్లీగల్ లే అవుట్లు.. ఆగ్రహంలో రియల్టర్లు
హెచ్ఎండీఏ అధికారులు మూడు జిల్లాల్లోని 548 లే అవుట్లను ఇల్లీగల్ అంటూ ప్రకటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ అధికారులు మూడు జిల్లాల్లోని 548 లే అవుట్లను ఇల్లీగల్ అంటూ ప్రకటించారు. ఆ పూర్తి వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. ఈ అంశం పట్ల రియల్ ఎస్టేట్ వర్గాలు, ప్లాట్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన వీటిని అక్రమ లే అవుట్లుగా గుర్తించారని నిలదీస్తున్నారు. ఏ చట్టం, ఏ అధికారం ప్రకారం వీటిని ఇల్లీగల్ అంటున్నారో చెప్పాలంటూ రియల్టర్లు డిమాండ్ చేస్తున్నారు. వీటిలోని ప్లాట్లను ఎవరూ కొనుగోలు చేయొద్దని, వీటిపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండా నిషేధిత జాబితాలో పెట్టినట్లు వెబ్ సైట్ లోని వివరాల సారాంశం. అదే నిజమైతే కలెక్టర్ల నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి పంపిన ప్రొసీడింగ్స్ చూపాలంటూ అధికారులను నిలదీస్తున్నారు. ఐజీ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ క్లియరెన్స్ అందుతుంది. అప్పుడే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ లోనూ నిషేధిత జాబితాలో పేర్కొంటారు. ఇప్పటికీ అలాంటి ఆదేశాలు ఏవీ తమకు అందలేదని ఈ రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, మహబూబ్ నగర్ ప్రాంత సబ్ రిజిస్ట్రార్లు చెప్తున్నారు. ఏ సబ్ రిజిస్ట్రార్ ని అడిగినా అలాంటి ఉత్తర్వులు రాలేదంటున్నారు. ఆర్డర్ కాపీ వస్తేనే రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని, అప్పటి దాకా ట్రాన్సక్షన్స్ కొనసాగిస్తామంటున్నారు. దీని బట్టి హెచ్ఎండీఏ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మధ్య సమన్వయమే లేదా? ఏకపక్షంగా వెబ్ సైట్ లో పెట్టారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై 21న ‘దిశ’లో ‘548 లే అవుట్లు ఇల్లీగల్.. రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ హెచ్ఎండీఏ నిర్ణయం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై సీఎంవో ఆరా తీసింది. ఏ విధంగా ఇల్లీగల్ లే అవుట్లు అంటూ కొత్తగా జాబితాను రూపొందించారంటూ ఆరా తీసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు కూడా దీనిపై విచారిస్తున్నారు.
30 ఏండ్ల క్రితమే అమ్మకాలు
హెచ్ఎండీఏ రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని లే అవుట్లను ఇల్లీగల్ అంటున్నది. నిజానికి వీటిలో కొన్ని 30 ఏండ్ల క్రితమే వెలిశాయి. రిజిస్ట్రేషన్లు చాలా వరకు అయ్యాయి. కొన్నింట్లో ఇండ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. ఇప్పుడేమో అవే లే అవుట్లు అక్రమమంటూ తేల్చడం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కావడం లేదంటున్నారు. పైగా రెవెన్యూ గ్రామం, సర్వే నంబర్లతో సహా వెబ్ సైట్ లో దర్శనమివ్వడంతో ప్లాట్ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగానికి హైడ్రా భయం పట్టుకున్నది. ఈ దశలో ఏం ఆశించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని రియల్ వ్యాపారులు మండిపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయమైతే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు అందాయి. ఇప్పుడీ గందరగోళం సృష్టించడంతో ఆయా సర్వే నంబర్లలో ప్లాట్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటికే తాము ప్లాట్లు అమ్ముడుపోక తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హెచ్ఎండీఏ అధికారులు రియల్ ఎస్టేట్ రంగాన్ని దివాళా తీయించేందుకు కంకణం కట్టుకున్నారా అని అత్తాపూర్ కు చెందిన ఓ వ్యాపారి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు తెలియకుండానే ఇది జరిగి ఉంటుందన్నారు. అందుకే హెచ్ఎండీఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడిందన్నారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకోండి
హెచ్ఎండీఏ పరిధిలోనే 548 లే అవుట్లు అనధికారమని, వీటన్నింటిపైనా రిజిస్ట్రేషన్లు నిషేధిస్తున్నట్లు ప్రకటించడానికి చట్టమే లేదు. వీటిని 22–ఎ(1)(ఇ)లో నిషేధిత జాబితా కింద నమోదు చేసే అధికారం కలెక్టర్లకు కూడా పూర్తిగా లేదు. అప్పట్లో పంచాయతీ సిబ్బంది అనుమతులు ఇచ్చారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇల్లీగల్ గా అనుమతులు ఇచ్చింది ఎవరు? రిజిస్ట్రేషన్లు చేసింది ఎవరు? అనే అంశాలు తెర మీదికి వస్తున్నాయి. ఇదే విషయంపై వివరాలు తెలుసుకునేందుకు ప్లాట్ల యజమానులు హెచ్ఎండీఏ కార్యాలయానికి క్యూ కట్టారు. ఇప్పటికే ప్లాట్ల అమ్మకాలు పడిపోయిన తరుణంలో నిషేధిత జాబితా అంటూ జనాన్ని ఆందోళనకు గురి చేయడం తగదంటున్నారు.