బంజారాలకు దగ్గరవుదాం.. BJP హైకమాండ్‌కు రవీంద్రనాయక్ రిక్వెస్టు
దక్షిణ భారతదశంలో దాదాపు 60 పార్లమెంటు స్థానాల్లో, 300 అసెంబ్లీ సెగ్మెంట్లలో బంజారా, లంబాడాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని, ఆ కమ్యూనిటీని దగ్గర చేసుకోవడం బీజేపీకి చాలా అవసరమని ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్ వ్యాఖ్యానించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ భారతదశంలో దాదాపు 60 పార్లమెంటు స్థానాల్లో, 300 అసెంబ్లీ సెగ్మెంట్లలో బంజారా, లంబాడాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని, ఆ కమ్యూనిటీని దగ్గర చేసుకోవడం బీజేపీకి చాలా అవసరమని ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఈ కమ్యూనిటీ ప్రజలు ఉంటున్నా కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ (షెడ్యూల్డు ట్రైబ్)గా గుర్తింపు ఉన్నదని, మరికొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ (షెడ్యూల్డు క్యాస్ట్)గా గుర్తిస్తున్నట్లు పార్టీ హైకమాండ్‌కు పంపిన ఒక నోట్‌లో ఆయన పేర్కొన్నారు. చాలాచోట్ల ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీగా కాంగ్రెస్‌వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న ఈ కమ్యూనిటీ అవసరాలు తీర్చడంలో ఆయా పార్టీలు విఫలమయ్యాయని, ఇప్పుడు బీజేపీ వాటిమీద దృష్టి పెట్టడం తక్షణ అవసరంగా ముందుకొచ్చిందన్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నప్పటికీ ఎక్కువగా బంజారా, లంబాడా, లామణి, బ్రిజ్‌వాసి తదితర తెగలుగా గుర్తింపు పొందాయన్నారు. కానీ అన్ని రాష్ట్రాల్లోని ఈ కమ్యూనిటీ ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, పండుగలు చేసుకోవడం, భాష ఒకే తీరులో ఉంటుందని, లిపిలేని భాషగా గోర్-బొలినే మాట్లాడతారని వివరించారు. నిజాం కాలంలో మొత్తం 16 జిల్లాల్లో లంబాడాలు ఉండేవారని, ఆ తర్వాతి కాలంలో ఈ ప్రాంతమే కొత్త జిల్లాలుగా ఏర్పడి ప్రస్తుతం 42 జిల్లాలుగా మారిందన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని మరో ఆరు జిల్లాల్లోనూ లంబాడాల ప్రభావం ఉండేదన్నారు.
కాలక్రమంలో లంబాడాలు మొత్త, 12 తెగల కిందకు చేరారని వివరించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గణనీయంగానే ఉన్నట్లు వివరించారు. ఇక కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎస్సీలుగా గుర్తింపు ఉన్నదని తెలిపారు. ఉత్తరాదిన బాజీగర్, బ్రిజ్‌వారి (బ్రిజ్‌వాసి), సిర్కింబంద్, గ్వాల్, గ్వరియా పేర్లతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఉన్నారని తెలిపారు. మహారాష్ట్రలో డీనోటిఫైడ్ జాబితాలో ఉన్నా గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా లాంటి చోట్ల బీసీలుగా గుర్తింపు ఉన్నదన్నారు. ఎక్కడ ఉన్నా వీరి ఆరాధ్య దైవం మాత్రం సేవాలాల్, హాథీరాంజీ బాలాజీ (బావాజీ), జగదాంబ మాతా, రాంజీ హనుమాన్‌జీ అని వివరించారు.
గోర్-బొలి భాషకు లిపి లేదని, కేవలం మాట్లాడడానికే బంజారాలు, లంబాడాలు వాడుతున్నారని, రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూలు ప్రకారం దీనికి గుర్తింపు ఇవ్వడంతో పాటు ఈ కమ్యూనిటీ ప్రజలు నివసించే తండాలను బంజారా విలేజ్ రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. బంజారాల రక్షణ కోసం రాజ్యాంగ అధికారాలు (చట్టబద్ధత) కలిగిన కమిషన్‌ను నియమించాలని కోరారు. హాథీరాంజీ మఠం పేరుతో తిరుమల, తిరుపతిలో విలువైన స్థిరాస్తులు ఉన్నాయని, వాటిని కేంద్ర హోంశాఖ ద్వారా రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కమ్యూనిటీకి దగ్గర కావడానికి హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్ ప్రాంతంలో 10 ఎకరాలను కేటాయించి అక్కడ సేవాలాల్, జగదాంబ, హనుమాన్‌జీ మందిరాలతో పాటు సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాలని కోరారు. హైదరాబాద్ జిల్లా పేరును సేవాలాల్ మహారాజ్ పేరును (సేవాదాస్ జిల్లా) పెట్టాలని సూచించారు.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ జనరల్ స్థానం నుంచి పోటీ చేయడానికి తన పేరును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా బీజేపీ అగ్ర నాయకత్వానికి రవీంద్రనాయక్ ప్రతిపాదనలు పంపారు. గతంలో ఈ జిల్లాలోని దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన తాను ఒకసారి వరంగల్ (అప్పట్లో హన్మకొండ) జనరల్ స్థానం నుంచి గెలిచానని, ఈసారి కూడా నల్లగొండ జనరల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని రిక్వెస్టు పెట్టారు. ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో లంబాడా ప్రజలు, ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, తనకు విశేషమైన గుర్తింపు ఉన్నదని, గెలిచే స్థానంగా మారుతుందని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఫస్ట్ లిస్టులో తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో నల్లగొండ స్థానం నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు.