నిరుద్యోగుల భిక్షతో గెలిచిన కాంగ్రెస్ పాలనలో మళ్లీ రక్తపాతం: రాణిరుద్రమ ఫైర్
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమంలో పోలీసుల లాఠీ దెబ్బలతో రక్తమోడిన రాష్ట్రంలోని వర్సిటీలు మళ్లీ అదే
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమంలో పోలీసుల లాఠీ దెబ్బలతో రక్తమోడిన రాష్ట్రంలోని వర్సిటీలు మళ్లీ అదే కాంగ్రెస్ పాలనలో తెలంగాణ యూనివర్సిటీలు రక్తమోడాయని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల దమనకాండ కనిపిస్తోందని ఆమె విరుచుకుపడ్డారు. ఉద్యోగాల కోసం, స్వరాష్ట్రం కావాలని విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విద్యార్థులకు అన్యాయం చేశాయని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు, జర్నలిస్టులపై పోలీసులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రూ.2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా, ప్రతిపక్షంలో ఉన్నపుడు డిమాండ్ చేసిన 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ వేయకపోగా, డీఎస్సీ వాయిదా కోసం పోరాడుతున్న విద్యార్థులపై చేయి చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా ప్రతినిధిని చొక్కా పట్టుకుని లాక్కెళ్లడం.. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపడమేనని రాణిరుద్రమ తెలిపారు. నిరుద్యోగుల ఓట్ల భిక్షతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు గ్రూప్ 2, 32 పోస్టులను పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడి విషయంలో హోంశాఖకు కూడా తానే మంత్రిగా సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్న రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని రాణిరుద్రమ డిమాండ్ చేశారు.