ఇందిరమ్మ కమిటీలతో పారదర్శక పాలన : ఎమ్మెల్యే

అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన పేద కుటుంబాలకు అందించేందుకు వారధులుగా ఇందిరమ్మ కమిటీలు పని చేస్తాయని,

Update: 2025-03-23 11:44 GMT
ఇందిరమ్మ కమిటీలతో  పారదర్శక పాలన : ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, తాండూరు : అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన పేద కుటుంబాలకు అందించేందుకు వారధులుగా ఇందిరమ్మ కమిటీలు పని చేస్తాయని, ఈ కమిటీల ద్వారా గ్రామాల్లో పాలన పారదర్శకంగా ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్స్ లో నియోజకవర్గ పరిధిలో గల ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. దీంతో భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలి రావడంతో సమావేశం సక్సెస్ అయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనేదే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక లక్ష్యం అని అన్నారు. ప్రతి పేదోడి సొంతింటి కళ నెరవేరే సమయం ఇది అని అన్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతోపాటు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలు చేసిందన్నారు. మరో నాలుగు పథకాలు అమలు చేయనున్నట్లు రైతుభరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీలకు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.6లక్షలు అందిస్తామన్నారు.

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

మాదిగ జాతి సోదరుల చిరకాల డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణ ఒకవైపు, బీసీలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు బీసీ కులగణన మరోవైపు నిర్వహించి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. బీసీల దశాబ్దాల పోరాటంతో బీసీ కులగణన, మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ బిల్లును కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించడం హర్షనీయమన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బీసీలు రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేకనే బిఆర్ఎస్ పార్టీ బీసీ కుల గణన సర్వేపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

రెండేళ్లలో తాండూరు రూపురేఖలు మారుస్తా!

నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ,తండాకు రహదారుల నిర్మాణం రానున్న రెండు సంవత్సరాలలో పూర్తి స్థాయిలో జరగబోతుందన్నారు. వచ్చే రెండేళ్లలో తాండూర్ లో రహదారుల సమస్య ఉండదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి అధిక మొత్తంలో నిధులు తెచ్చి, నాణ్యమైన పనులు చేసే విధంగా అధికారులను నాయకులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. తాండూరు ప్రాంతం బాగుండాలంటే ఇక్కడ విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తాండూర్ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. తాండూర్ లో ఏ చిన్నపాటి వర్షం పడిన సముద్రాన్ని తలపిస్తుంది, భవిష్యత్తులో ఇలా జరగకూడదనే ఉద్దేశంతో గొల్లచెరువు, చిలుక వాగు ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయన్నారు.అతి త్వరలో తాండూర్ మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, కాగ్నా నది నుంచి మంచి నీటి సరఫరా కూడా చేపట్టబోతున్నమన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యులు ఎం.రమేష్ మహారాజ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు సురేందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్. మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నె నాగప్ప, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, నాయకులు మురళీ గౌడ్, భీప్ప, మాజీ ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Similar News