వెయ్యేళ్ల జైన శిల్పాలను కాపాడుకోవాలి

Thousands of years old Jain sculptures should be preserved

Update: 2023-06-26 15:00 GMT

హైదరాబాద్, జూన్ 25 : రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, ఎనికేపల్లి శివారులో చెరువు తూముకు రాష్ట్రకూటుల కాలపు జైన తీర్థంకర శిలా ఫలకాలు బిగించబడి ఉన్నాయని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. యువ పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు, ఆయన ఆదివారం నాడు ఆ శిల్పాలను పరిశీలించారు.

ఎనికేపల్లి ఊరి చెరువు కట్ట తూముకు రెండు వైపులా ఒకటి గ్రానైట్, మరొకటి నల్ల శాసనపు రాతి స్తంభాలను బిగించారని, వాటి పైన ఆదినాథ, నేమినాథ, పార్శ్వనాథ, వర్ధమాన మహావీర శిల్పాలు ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నట్లు, పైన కీర్తి ముఖాలతో మలచబడి ఉన్నాయని, రెండు శిలా ఫలకాలపై క్రీ. శ. 9-10 శతాబ్దాల నాటి తెలుగు- కన్నడ శాసనాలు ఉన్నాయన్నారు. శాసనాలు గోడలో పూడుకు పోయినందున చదవటానికి వీలు చిక్కలేదని, జైన బసదికి చెందిన దాన శాసనాలుగా తెలుస్తుందని, ఈ జైన శిల్పాలను పూర్తిగా బయటికి తీసినప్పుడు మాత్రమే శాసన వివరాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. దాదాపు 100 సం|| ల క్రితం నిర్మించిన తూముకు స్థానిక శిధిల జైనాలయం నుంచి తెచ్చి వీటిని బిగించి ఉంటారని, సమీపంలోని చిలుకూరు రాష్ట్రకూట, వేములవాడ చాళుక్యుల కాలంలో సుప్రసిద్ధ జైన కేంద్రమని, ఎనికేపల్లి జైన బసది కూడా ఆ కాలం నాటిదేనని ఆయన అన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ రెండు జైన చౌముఖ శిలా ఫలకాలను పూర్తిగా కనిపించే విధంగా పీఠాలపై నిలబెట్టి భద్రపరచాలని శివనాగిరెడ్డి ఎనికేపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News