అక్రమ నిర్మాణాలకు అడ్డాగా శంషాబాద్ మున్సిపాలిటీ
ఇచ్చుకో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం ఉన్నట్లు కట్టుకో ఎవరు రాకుండా చూసే బాధ్యత నాది అంటూ మున్సిపల్ అధికారే అక్రమ నిర్మాణాల దారులకు అండదండలుగా నిలవడంతో అక్రమ నిర్మాణాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది
దిశ, శంషాబాద్ : ఇచ్చుకో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం ఉన్నట్లు కట్టుకో ఎవరు రాకుండా చూసే బాధ్యత నాది అంటూ మున్సిపల్ అధికారే అక్రమ నిర్మాణాల దారులకు అండదండలుగా నిలవడంతో అక్రమ నిర్మాణాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు, వెంచర్లకు అనుమతి లేదు. అయితే ఈ నిబంధనలు కేవలం పేదవారికి మాత్రమే, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వర్తించవు అనే విధంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తాయి. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊట్ పల్లి లోని రాయల్ విల్లా,మధురా నగర్,ఆర్బీనగర్,రాళ్ళగూడ,సామ ఎనిక్లూవ్,వెల్లంకి నగర్ లో భారీ అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతుంటే మున్సిపల్ అధికారులకు కనిపించలేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
స్థానికులు ఉండటానికి ఇల్లు కట్టుకుంటే అక్రమ నిర్మాణం అంటూ హడావుడి చేసి కూల్చివేసే మున్సిపల్ అధికారులకు ఈ భారీ నిర్మాణాలు ఎందుకు కనిపించవు అంటున్నారు. అక్రమ నిర్మాణ అధికారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలుకుతూ నోటీసులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్న మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. అక్రమ నిర్మాణాదారును విలేకర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇంత పెద్ద నిర్మాణం ఎలా చేస్తున్నరని ప్రశ్నిస్తే మా సొంత పట్టా భూమిలో మేము ఏమైనా నిర్మిస్తాం అది మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు చూసుకుంటారు ఇక్కడ మీకేం పని అంటూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.
అయితే శంషాబాద్ పూర్తిగా 111 జీవో పరిధిలో ఉందని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఉండదని, అక్రమ నిర్మాణాలు దారులకు తెలిపితే మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారితో మాట్లాడే మేము కట్టడాలు ప్రారంభించామని, అదే ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం అని అక్రమ నిర్మాణాదారులు బరితెగించి ఇంత కరాకండిగా చెబుతున్నారంటే మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకుల బలం ఎంత పుష్కలంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి పేదవారికి ఒక న్యాయం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక న్యాయంలా ప్రవర్తించకుండా అక్రమ నిర్మాణ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇంటి నెంబర్ కావాలంటే లక్షలు ఇవ్వాల్సిందే
శంషాబాద్ మున్సిపాలిటీ పూర్తిగా 111 జీవో పరిధిలో ఉండటం తో అక్రమ నిర్మాణాలకు అనుమతులు లేవు. ఇదే అదనుగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు జేబులు నింపుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఎక్కడ నిర్మాణాలు జరిగిన అక్కడ వెళ్లి అక్రమ నిర్మాణం అంటూ నోటీసు ఇచ్చి ఆఫీస్ కి వచ్చి, మున్సిపల్ ఆఫీసుకు రావాలని చెప్పడంతో ఆఫీసుకు వస్తే మీది అక్రమ నిర్మాణం కూల్చివేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. సార్ ఎలాగైనా మాకు ఇంటి నెంబర్ కావాలని అడిగితే, ఇంటి నెంబర్ కావాలంటే లక్షలు ఇచ్చుకోవాల్సిందే అని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి చెప్పడంతో చేసేదేమీ లేక ముడుపులు ఇచ్చుకుంటున్నారు. ఫస్ట్ నిర్మాణం ప్రారంభించి గ్రౌండ్ ఫ్లోర్ కు సున్నం వేసి మిగతాది కట్టుకోవాలని మున్సిపల్ అధికారులు సలహా ఇవ్వడంతో మున్సిపల్ అధికారులే మనకు అండగా ఉండడంతో మనల్నిఅనే నాథుడే లేడని రీతిలో అక్రమ నిర్మాణాల దారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
12వ వార్డు ఊట్ పల్లి మాజీ కౌన్సిలర్ కొండ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ…
12వ వార్డులో కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని లిఖిత పూర్వకంగా కూడా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారికి అనేకమార్లు ఫిర్యాదు చేశానన్నారు. అయినా మున్సిపల్ అధికారులు ఒక్కసారైనా వార్డులో పర్యటించి అక్రమ నిర్మాణాలను పరిశీలించలేదన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలపై అనేకమార్లు కౌన్సిల్ సమావేశంలో కూడా చర్చించిన పట్టించుకోలేదన్నారు. సామాన్యుడి ఇల్లు కట్టుకుంటే అక్రమ నిర్మాణం అని మున్సిపల్ అధికారులు వచ్చి పనులు ఆపడం పనిముట్లు గుంజుకు పోవడం జరిగింది, కానీ భారీ భవనాలు నిర్మిస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక అధికారి మనోహర్ వివరణ
శంషాబాద్ మున్సిపాలిటీ పూర్తిగా 111 జీఓ పరిధిలో ఉందని అందరికీ తెలుసు అని తెలిసే కట్టుకుంటున్నారన్నారు. వాళ్లు నిర్మాణం చేసుకుంటే మేము ఏం చేయాలి, మేం బిజీగా ఉన్నా అని వెళ్లిపోయారు.