స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లిన వ్యక్తికి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లిన వ్యక్తి తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం చోటుచేసుకుంది.
దిశ, మీర్ పేట్ : స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లిన వ్యక్తి తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం చోటుచేసుకుంది.ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాచలపల్లె, గ్రామం మిడ్జిల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన యం డి హాసన్( 60) హస్తినాపురం జడ్పీ రోడ్ లోని ఓ టిఫిన్ సెంటర్ లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోనీ అల్మాస్ గూడ ఆర్కా స్కూల్ వద్ద గల జె ఎస్ ఆర్ స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్ళి డైవ్ చేయగా ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.