మీర్ పేటలో ప్రయివేట్ 'హాస్టల్స్' దందా..

తమలాగే తమ పిల్లలు కష్టపడొద్దు.. చదువులకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. వారిని మంచి చదువులు చదివించాలని, ఉన్నత స్థానాల్లో నిలపాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలను కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ స్థాయి వసతి గృహాల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.

Update: 2022-10-19 12:06 GMT

దిశ, మీర్ పేట : తమలాగే తమ పిల్లలు కష్టపడొద్దు.. చదువులకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. వారిని మంచి చదువులు చదివించాలని, ఉన్నత స్థానాల్లో నిలపాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆశలను కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ స్థాయి వసతి గృహాల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నారు. సకల సౌకర్యాలు కల్పిస్తామని మొదట్లో చెప్పి హాస్టల్లో చేరిన తర్వాత సరైన సదుపాయాలు కల్పించకపోగా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మీర్ పేటలో వందకు పైగానే ..

రంగారెడ్డి జిల్లా మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీకేఆర్, టీఆర్ఆర్ వంటి ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వందల సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ స్థాయి హాస్టల్లలో పెద్దఎత్తున ఫీజులు వసూలు చేస్తుండటంతో, స్థానికంగా ఉన్న ప్రయివేట్ వసతి గృహాలను ఆశ్రహిస్తున్నారు. మీర్ పేట ప్రాంతంలోని వివిధ కాలనీల్లో వందలసంఖ్యలో వసతి గృహాలను నడుపుతున్నారు. వీటిలో 90శాతం పైగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నవేనని వార్తలు వినిపిస్తున్నాయి. కాసుల కక్కుర్తి ధ్యేయంగా ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందే ప్రయివేట్ వసతి గృహాలను నడుపుతూ పిల్లలకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు అంటున్నారు.

అనుమతి లేని హాస్టల్స్ పై చర్యలేవి..?

సరైన నాణ్యత ప్రమాణాలు పాటించని వసతి గృహాలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిద్ర పోతున్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వందల సంఖ్యలో ప్రయివేట్ వసతి గృహాలున్నప్పటికి, 90శాతం పైగా ఎలాంటి అనుమతులు లేనివే ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్ యాజమాన్యం ఫైర్, ట్రేడ్ లైసెన్స్, ఫసాయ్ లైసెన్స్ లు తీసుకోవాల్సి ఉండగా ఏ ఒక్క లైసెన్స్ లేకుండా దందా నడుపుతున్నట్లు విశ్వసనీయసమాచారం. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి కూడ గండి పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News