MLA Kasireddy : లండన్ బయలుదేరిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి..
దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు.
దిశ, తలకొండపల్లి : దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అచ్చంపేట నుండి మొదలుకొని మున్ననూరు, ఈగల పెంట, కర్నూల్, శ్రీశైలం వరకు విస్తరించి ఉంది ఈ నల్లమల్ల అటవీ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోనే అత్యంత వైశాల్యం కలిగిన దట్టమైన అడవి ప్రాంతంలో కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ నల్లమల్ల అడవి ప్రాంతం సుమారు 9500 చదరపు అడుగులు, 3000 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అతిపెద్ద వైశాల్యం కలిగిన ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని గతంలోనే కొల్లాపూర్ నుండి గెలుపొందిన జూపల్లి కృష్ణారావుకు రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, ప్రోబీటేషన్, టూరిజం, కల్చరర్స్ కు సంబంధించిన మంత్రి పదవి అప్పగించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో సుమారు 10 మంది ఎమ్మెల్యేలతో పాటు పర్యాటక రంగానికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి లండన్ కు బయలుదేరినట్లు సమాచారం. లండన్ బయలుదేరిన వారిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది.
నల్లమల్ల ప్రాంతం మొత్తం విశాలమైన దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఆ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా చేయాలి అనే ఒక గొప్ప సంకల్పం, అదేవిధంగా హైదరాబాద్ నగరంలోని మురికి దుర్వాసనతో కనిపించే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేసి సర్వాంగ సుందరంగా చూడాలనే సంకల్పంతో మంత్రి జూపల్లితో పాటు రాష్ట్రంలోని సుమారు పదిమంది ఎమ్మెల్యేలు లండన్ కు బయలుదేరారు. ఈ నెల 5 నుండి 7 వ తేదీ వరకు లండన్ లో జరగనున్న ప్రపంచ పర్యాటక ప్రదర్శన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని క్షుణ్ణంగా పరిశీలించి ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తుంది. సోమవారం ఉదయం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లండన్ కు బయలుదేరుతుండడంతో స్థానిక నేతలు కసిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సాగనంపారు. మళ్లీ ఈ నెల 9న సాయంత్రం లేదా 10వ తేదీన తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.