అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగల అరెస్టు

ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు.

Update: 2024-12-24 14:39 GMT

దిశ ప్రతినిధి వికారాబాద్ : ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం… ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి గత సెప్టెంబర్ నెల 20వ తేదీ శుక్రవారం నాడు బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5 తులాల బంగారు గొలుసు స్నాచింగ్ జరిగింది. అదే నెల రెండు రోజుల తరువాత 22 రోజున వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 2.5 తులాల బంగారం గొలుసు స్నాచింగ్ జరిగింది.

అదే రోజు కుల్కచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బంగారు గొలుసు స్నాచింగ్ చేయడానికి ప్రత్నించారని ఫిర్యాదు వచ్చింది. ఇలా జిల్లాలో రెండు రోజులలోనే 3 స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో ఈ కేసులను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీస్ శాఖ స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు, సి‌సి‌ఎస్ ఇన్స్పెక్టర్లు బలవంతయ్య, అన్వర్ పాషా ఆధ్వర్యంలో టీమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. టెక్నికల్ ఆధారాలు, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలలో ఏర్పాటు చేసిన సీసీటి‌విల ద్వారా సేకరించిన ఆధారాలతో జిల్లాలో చైన్ స్నాచింగ్ చేసిన అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ నేరస్థులు అయిన ఎం‌డి జావిద్ తో పాటు ఒక మైనర్ బాలుడిని కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా, హుంనాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద వికారాబాద్ సి‌సి‌ఎస్ పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

నేరం ఎలా చేస్తారు అంటే..

నేరస్థులు అయిన ఎం‌డి జావిద్, మైనర్ బాలుడు ఇద్దరు చైన్ స్నాచింగ్ చేయడానికి ముందుగా తాము దొంగతనం చేసిన ద్విచక్ర వాహనం పైన గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి, తమ దగ్గర పెప్పర్ స్ప్రే ఒక వేట కొడవలిని వెంటపెట్టుకుంటారు. ఈ నేరస్తులు వాకింగ్ చేసే ఒంటరి మహిళలను ,ఆరుబయట కూర్చున్న మహిళలను, కిరాణా కొట్టులలో ఉన్న మహిళలనే టార్గెట్ చేస్తారు. ఇద్దరిలో ఒక నేరస్తుడు బైక్ నడిపిస్తాడు. ఇంకొక నేరస్తుడు వెనకాల కూర్చొని ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వాళ్ళ మెడలో ఉన్న బంగారం గొలుసులను స్నాచింగ్ చేసుకొని అక్కడి నుంచి బైక్ మీద పారిపోతారు. ఎవరైనా వారిని ఎదిరిస్తే వారి కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టి, వేట కొడవలితో భయపెట్టి పారిపోతారు.

ఈ నేరస్తులు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే దొంగతనాలకు పాల్పడుతారు. ఆదివారం రోజున ఎలాంటి నేరాలకు పాల్పడరు. ఏ1 నేరస్థుడు అయిన ఎం‌డి జావిద్ దొంగతనానికి వచ్చే ప్రతిసారి తన వెంబడి ఆరిఫ్, మేరాజ్, అర్షాద్, రశీద్ పటేల్, ఆఫ్రోజ్, వజీద్, సమీర్, రవూఫ్, అర్బస్ లలో ఎవరినైనా ఒకరిని తోడుగా తీసుకొని వచ్చి నేరాలకు పాల్పడుతాడు. ఏ1 నిందితుని పైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ అలాగే రంగారెడ్డి జిల్లాలలో మొత్తం కలిపి సుమారు 150 కేసులు నమోదై అయ్యాయి.

పోలీసుల నుంచి తప్పించుకొనే విధానం..

నేరస్థులు నేరాలకు పాల్పడిన తర్వాత చాలా చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటారు. ఇన్ని నేరాలకు పాల్పడి కూడా కేవలం రెండుసార్లు మాత్రమే పోలీసులకు దొరకడం జరిగింది. నేరస్తుడు నేరం చేసిన వెంటనే పోలీసులకు చిక్కకుండా వెంటనే తాము వాడిన బైక్ నెంబర్ ప్లేట్, వేసుకున్న బట్టలను మార్చేస్తారు. టెక్నికల్ గా కూడా పోలీసులకు చిక్కకుండా నిందితులు ఎప్పటికప్పుడు తన సెల్ ఫోన్ లు, సిమ్ కార్డ్స్ మార్చుకుంటూ, తమ సెల్ ఫోన్ నుండి ఎవరికి కూడా డైరెక్ట్ గా కాల్స్ చేయకుండా జాగ్రత్త పడతారు. దారిన పోయే అమాయకులతో మంచిగా మాట్లాడుతూ… వారి మొబైల్ ఫోన్ తీసుకొని వారి ఫోన్ నెంబర్ తో నేరస్థులు తమ సెల్ ఫోన్ లో వాట్ససాప్ ఏర్పాటు చేసుకొని వాడుతారు. తమ సెల్ ఫోన్ లోని ఇంటర్నెట్ తో కాకుండా తమ ఇతర మొబైల్ లోని హాట్ స్పాట్ తో వీళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని వాడుతారు.

నేరాలు చేయడానికి వచ్చే ముందు 100 కిలోమీటర్స్ దూరంగా ఉన్నప్పుడే తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని వచ్చి, నేరం చేసిన తర్వాత తిరిగి 100 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయి తమ సెల్ ఫోన్ లను నేరస్థులు స్విచ్ ఆన్ చేసుకుంటారు. ఏ1 నేరస్తుని పైన రెండవ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, బీధర్ (సిట్టింగ్ బసవకళ్యాన్) కోర్ట్ లో ఎన్.బి.డబ్ల్యు పెండింగ్ లో ఉంది. అలాగే 2020 లో నిందితుడు చర్లపల్లి జైలు (జుడిషియల్ కస్టడీ) లో ఉండగా కరోనా వ్యాధి రాగ, చికిత్స కొరకు గాంధీ హాస్పిటల్ నందు అడ్మిట్ చేయగా అక్కడ ఉన్న ఎస్కార్ట్ పోలీస్ సిబ్బంది కండ్లు కప్పి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు.

దాంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్ నందు కేసు చేసి ఏ1 నేరస్థున్ని పట్టుకొని రిమాండ్ చేయగా జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి జైలులో ఉండి 2022 నవంబర్ లో కోర్టు నుంచి బెయిల్ తీసుకొని బయటకి రావడం జరిగింది. ఈమధ్య మళ్ళీ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎన్.బి.డబ్ల్యు పెండింగ్ లో ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా జిల్లాలో వికారాబాద్, బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో చైన్ స్నాచింగ్ చేయడం అలాగే కుల్కచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేయుటకు ప్రయత్నం చేసినట్లు అంగీకరించాడు. ఇవే కాకుండా సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట్, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ల పరిధిలలో కూడా నిందితుడు చైన్ స్నాచింగ్ చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది.

రికవరీ

నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ పి‌ఎస్ లో నమోదు అయిన కేసులో నుండి 2.5 తులాల గోల్డ్ చైన్, సదాశివపేట్ పి‌ఎస్ పరిధిలోని కేసులో 4 తులాల గోల్డ్ చైన్, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కేసులోని 3.5 తులాల గోల్డ్ చైన్ లను మొత్తం సుమారు రూ. 7,80,000 విలువ గల 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరస్తుల నుండి రెండు పెప్పర్ స్ప్రే లు, వేటకొడవలిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు.


Similar News