ఒకప్పుడు వందలాది ఎకరాలకు సాగునీరు.. నేడు వెలవెలబోతున్న చెరువు

వందల ఎకరాల భూములకు సాగునీరు అందించడంతో పాటు.. వేలాది మందికి మంచి నీరందించిన గుర్రం చెరువు ప్రస్తుతం గుర్రపు డెక్కతో వెలవెలబోతోంది.

Update: 2025-03-16 02:36 GMT

దిశ, బడంగ్ పేట్: వందల ఎకరాల భూములకు సాగునీరు అందించడంతో పాటు.. వేలాది మందికి మంచి నీరందించిన గుర్రం చెరువు ప్రస్తుతం గుర్రపు డెక్కతో వెలవెలబోతోంది. గుర్రపు డెక్క కారణంగా పరిసర ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెంది ప్రజలకు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తున్నాయి. అంతేగాకుండా గుర్రపు డెక్క కారణంగా భరించ లేని దుర్వాసనతో స్థానికులు ఇళ్లలో నివసించలేని పరిస్థితి ఎదురైంది. బాలాపూర్​ గుర్రం చెరువు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. రియల్​ వ్యాపారులు చెరువుపై కన్నేసి ఎఫ్​టిఎల్​, బఫర్​జోన్లు అక్రమించి లే అవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయించారు. ప్రస్తుతం గుర్రం చెరువు 16 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే కనిపిస్తుంది.

అప్పట్లో వందలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వేలాది మందికి తాగునీటి కష్టాలను తీర్చింది. సుమారు 70 ఎకరాల వరకు బాలాపూర్​ గుర్రం చెరువు ఆక్రమణకు గురయ్యాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కబ్జాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గుర్రం చెరువు 60 శాతం బాలాపూర్​ మండల పరిధిలోకి రాగా 40 శాతం బండ్లగూడ మండల రెవిన్యూ పరిధిలోకి వస్తుంది. ఈ గుర్రం చెరువు రెండు రెవెన్యూ మండలాల పరిధిలోకి కావడంతో ఇటు సంబంధిత అధికారులు గానీ, అటు ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకునే వారే కరువయ్యారు.

ఊడిపోయిన చెరువు ఫెన్సింగ్..

గుర్రం చెరువు కట్ట చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్​ అక్కడక్కడ ఊడిపోవడం తో స్థానికులు పెద్ద ఎత్తున చెరువులో చెత్తను, జంతు కళేబరాలను వేస్తున్నారు. గుర్రం చెరువు పరిసరాలు అంతా ఎల్లప్పుడు చెత్తకుప్పలతో నిండి ఉంటుంది. అయితే గుర్రం చెరువు చుట్టూ అక్కడక్కడ ఫెన్సింగ్​ ఊడిపోయి సంవత్సరం అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

కాల రాత్రి 2020 అక్టోబర్ 17.. పాతబస్తీని ముంచెత్తిన వరద నీరు

ఏకధాటిగా కురిసే వర్షాలకు పహాడీషరీఫ్​ , షాహిన్​నగర్​, బాలాపూర్​గ్రామం, మల్లాపూర్​, వెంకటాపూర్, ఆర్‌సీఐ, సుల్తాన్‌పూర్, దేవతల గుట్ట ప్రాంతాల్లోని వర్షపు నీరు నాలాల ద్వారా గుర్రం చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 2020 అక్టోబర్ 17వ తేదీన సాయంత్రం నుంచి మొదలైన ఏకధాటి వర్షాలకు పాతబస్తీ గుర్రం చెరువు కట్ట తెగిపోవడం కారణంగా హఫీజ్​ బాబా నగర్​ కు వరదలు ముంచెత్తాయి. అప్పట్లో హఫీజ్​బాబా నగర్, ఫూల్​బాగ్, ఉమర్​కాలనీ, శివాజీ నగర్, రాజీవ్​నగర్, బాబా నగర్​, నబీల్​ కాలనీ, సయీద్​ కాలనీ, రాయల్​ కాలనీ, మెట్రో సిటీ, వీఐపీ కాలనీ, ఆలీ గుల్షన్​, మజీద్​ కాలనీ తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవేశించింది. హఫీజ్​బాబా నగర్​లో మాత్రం గ్రౌండ్​ ఫ్లోర్​ వరకు వరద ముంచెత్తిందంటే ఏ స్థాయిలో వరద నీటి ప్రవాహం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గ్రౌండ్​ ఫ్లోర్ లో ఉన్న ప్రజలను మొదటి అంతస్థుకు వెళ్లిపోవాలని స్థానిక నేతలు అప్పట్లో సూచించారు.

అంతేగాకుండా రోడ్లపైకి భారీగా వచ్చిన వరద ఉధృతికి వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. దీంతో జీహెచ్​ఎంసి సిబ్బంది, ఎన్​డిఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగి వరదలో చిక్కుకున్న వారిని బోట్​లలో సురక్షిత ప్రాంతాలకు అప్పట్లో తరలించారు. ఈ ఘటనను పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు గుర్రం చెరువులో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండకుండా ఏర్పాటు చేసిన ఎస్​ఎన్​డిపి నాలా నుంచి మూసీకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎప్పుడు నిండు కుండలా ఉండే గుర్రం చెరువులో నీరు ప్రస్తుతం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఉన్న చెరువునైనా కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడంలో విఫలమయ్యారు. కనీసం గుర్రం చెరువులో గుర్రపు డెక్కనైనా తొలగించాలని స్థానికులు వేడుకుంటున్నారు.


Similar News