నిఘా నేత్రాలతో కేసుల పురోగతి.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
సీసీ కెమెరాలతో నిఘాను మరింత పెంచితే కేసుల్లో పురోగతి ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు.
దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : సీసీ కెమెరాలతో నిఘాను మరింత పెంచితే కేసుల్లో పురోగతి ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో 30లక్షల రూపాయల విలువ చేసే 50నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ సీసీ కెమెరాలు బంజారాహిల్స్ లోని పోలీసు కామాండ్ కంట్రోల్ సెంటర్ లో మానిటర్ చేస్తారని, వీటిని ఏర్పాటు చేయడం ప్రజలకు లాభదాయకమని అన్నారు.
నేరాలను అదుపు చేయడం, అసాంఘిక శక్తుల అరాచకాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రతీ కాలనీ వాసులు తమ కాలనిలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఒక్కో సీసీ కెమెరా ఒక్కో పోలీస్ స్టేషన్ తో సమానం అని వివరించారు. కాలనీల అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సంప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, టీఎస్ఎస్ ఐఐసీ జోనల్ మేనేజర్ రవి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, కమిషనర్ రామాంజుల రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.