కూరగాయల సాగుకు కేరాఫ్ అడ్రస్ జరుపుల తండా...

మాడ్గుల మండలంలో కూరగాయల సాగుకు జరుపుల తండా గ్రామపంచాయతీ కేరాఫ్ అడ్రస్ గా మారింది

Update: 2024-12-29 11:38 GMT

దిశ, మాడ్గుల : మాడ్గుల మండలంలో కూరగాయల సాగుకు జరుపుల తండా గ్రామపంచాయతీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. జరుపుల తండా తోపాటు చుట్టుపక్కల తండాలు అధిక విస్తీర్ణంలో కూరగాయల సాగుపై దృష్టి సారించి టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ హైదరాబాద్, మిర్యాలగూడ, మాచర్ల, దేవరకొండ, కల్వకుర్తి పట్టణాలకు తాము పండించిన కూరగాయలను ఎగుమతి చేస్తూ గిరిజనులు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారు. గతంలో వాణిజ్య పంటలైన పత్తి, ఆముదాల పంటను సాగు చేసి ఆర్థికంగా చితికిపోయిన గిరిజన కుటుంబాలు నేడు కూరగాయల పంటలతో లాభాలను అర్జిస్తుఉండడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూరగాయల పంటలను సాగు చేసేందుకు తండా గిరిజనులను ప్రోత్సహించి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 17 ఆటో ట్రాలీలను మాడ్గుల ఎస్బీఐ బ్యాంకు ద్వారా మంజూరు చేయించడంతో దళారుల బెడద లేకుండా తాము పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్ కు తరలించి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నామని ఆయా తండాల గిరిజనులు తెలిపారు. మండలంలోని కూరగాయల పంటలకు జరుపుల తండా పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ కూరగాయల సాగుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

కూరగాయల సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం...మాజీ సర్పంచ్ జరుపుల హీరా దేవి


గతంలో తండా ప్రజలతోపాటు, మాకు ఉన్న భూమిలో పత్తి, వాణిజ్య పంటలు సాగు చేయడంతో పండించిన పంటకు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలు అయ్యామని, కూరగాయల పంటలతో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నామని తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి… జరుపుల విజయకుమార్ నాయక్


యువత తాము చదివిన చదువుకు ఉద్యోగాలు రాక, ఉపాధి దొరకక ఇబ్బందులకు గురవుతున్న సమయంలో తండాలో కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యత నిచ్చి అప్పటి మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో మంజూరైన 17 ఆటో ట్రాలీలను మంజూరు చేయగా ప్రభుత్వ ఉద్యోగానికి ఆశపడకుండా తమ పొలంలో పండిన కూరగాయలను వివిధ ప్రాంతాలలోని మార్కెట్లకు తరలించి ఆత్మాభిమానంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

రాజకీయాలతో పాటు కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యతనిస్తాం.. మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్


తన సొంత తండా అయిన జరుపుల తండాలో కూరగాయల సాగుకు రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ,కూరగాయల సాగుతో తమ గిరిజన కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడటమే కాక నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందని అన్నారు.మాడ్గుల ఎంపీపీగా పదవి బాధ్యతలు నిర్వహించిన కూరగాయల సాగుకు ప్రత్యేక దృష్టి సారించి తన కుటుంబ సభ్యులతో పాటు రోజు వ్యవసాయ పనుల్లో పాల్గొంటానని తెలిపారు.


Similar News