Road Repair : చినుకు పడితే బురదమయం..
వాన వస్తే గ్రామీణ రహదారులు చిత్తడిగా మారి,
దిశ,బొంరాస్ పేట్ : వానొస్తే గ్రామీణ రహదారులు చిత్తడిగా మారి,రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.బొంరాస్ పేట్, దుద్యాల మండలాలలోని పలు తండాలకు వెళ్లే,దారులు చినుకు పడితే,బురదమై, అధ్వాన్నంగా మారాయి.ప్రధాన రోడ్డుల నుంచి తండాలకు వెళ్ళే వాటిపై కంకర తేలి, గుంతలమయంగా తయారయ్యాయి.గుంతల్లో నీరు చేరి,మడుగులను తలపిస్తున్నాయి.చిన్నపాటి వర్షానికే,రోడ్లు కరిగేట్లను తలపిస్తున్నాయి.అత్యవసర సమయాల్లో ప్రయాణానికి తీవ్ర అవస్థలు పడుతున్నా మంటున్నారు.
బొంరాస్ పేట్ లో..
మండలంలోని బుర్రి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని భోజన గడ్డ,మైసమ్మ గడ్డ తండాల రోడ్ల పైన ఏర్పడిన గుంతలతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రం నుండి మెట్ల కుంట గ్రామానికి,కొత్తూరు నుండి వడిచర్ల స్టేజి వరకు గల మట్టి రోడ్లు బురదమయంగా తయారయ్యాయి.
దుద్యాల మండలంలో..
మండలంలోని పోలేపల్లి తండాకు,పోలేపల్లి నుంచి సందారం వరకు గల మట్టి రోడ్లు కంకర తేలి,గుంతలు ఏర్పడి, బురదమయంగా మారి, నడకదారులు,ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అలాగే సత్తర్ కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని పీర్ల గడ్డ తండాకు గల మట్టి రోడ్డు పూర్తిగా గుంతలు ఏర్పడి, గుంతలలో నీరు నిండి,పూర్తిగా బురదమయంగా మారి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తండా ప్రజలు వాపోయారు.అదేవిధంగా సంట్రకుంట,పులిచర్ల కుంట,లగచర్ల నుండి గడ్డమీద తండాలకు గల మట్టి రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.కొడంగల్ నియోజకవర్గం నుండి ఎనుముల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై, ముఖ్యమంత్రి కావడంతో, నియోజకవర్గ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారు.అన్ని గ్రామాలకు,తండాలకు బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు అధికారులు, నాయకులు చెబుతున్నారు.
బీటి రోడ్డు వేయాలి : ఎం.బలరాం నాయక్,పీర్లగడ్డ తండా వాసి
చెట్టు పల్లి తండా నుంచి పీర్ల గడ్డ తండాకు గల రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు పూర్తిగా గుంతలుగా ఏర్పడి, బురదమయంగా తయారయింది.తండాలో సుమారు 200 మంది ప్రజలు ఉంటున్నారు.వర్షాకాలం వచ్చిందంటే,పాఠశాలకు విద్యార్థులు,తండా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బీటీ రోడ్డు వేసి,తండా వాసుల కష్టాలు తీర్చాలి.