బర్డ్ ఫ్లూ తో రంగారెడ్డి జిల్లాలో కలకలం
బర్డ్ ఫ్లూ సోకి వందలాది కోళ్లు మృత్యువాత పడుతున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ తో కోళ్లు మృత్యువాత పడుతుంటే కెమికల్స్ తో పూడ్చి వేస్తన్నట్లు సమాచారం.
దిశ, అబ్దుల్లాపూర్ మెట్టు : బర్డ్ ఫ్లూ సోకి వందలాది కోళ్లు మృత్యువాత పడుతున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ తో కోళ్లు మృత్యువాత పడుతుంటే కెమికల్స్ తో పూడ్చి వేస్తన్నట్లు సమాచారం. విషయం తెలిసిన అధికారులు సమాచారం ఇచ్చేందుకు అంతగా సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం, కొత్తగూడెం గ్రామ పరిధిలోని సంజీవరెడ్డికి చెందిన కోళ్ల షెడ్ లో గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నమూనాలను ల్యాబ్ లో పంపించిన అనంతరం బర్డ్ ఫ్లూ అని తేలడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు బహిర్గతంగా వెల్లడిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులలో మాత్రం చలనం ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ సోకి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నప్పటికీ, తెలంగాణలో బర్డ్ ఫ్లూ సోకి ప్రజలు ఇబ్బందుల పాలు కాకముందే వివరాలు తెలపవలసిన అధికారుల నిర్లక్ష్యం స్పష్టం అవుతుందని అంటున్నారు. ఏదేమైనా రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు మృత్యువాత పడుతున్న ఘటన కలకలం రేపుతోంది.
అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ వైరస్ బుధవారం నిర్ధారణ కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. రోజుకు సుమారు 1500 కోళ్లు చనిపోతున్నాయని గుర్తించిన అధికారులు వెంటనే శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపించారు. కాగా బుధవారం అది బర్డ్ ఫ్లూ అని తేలడంతో వెంటనే పౌల్ట్రీ ఫామ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంకా కొన్ని శాంపిల్స్ తీసుకొని వెరిఫికేషన్కు పంపించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా పౌల్ట్రీ ఫామ్లోని గుడ్లను, కోళ్లకు వేసే దాణా పై కెమికల్స్ వేసి వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నామని, ఇక వ్యాధి సోకిన కోళ్లను ప్రత్యేకమైన పద్ధతిలో పెద్ద గుంత తీసి పూడ్చిపెట్టామని అధికారులు తెలిపారు. అనంతరం పౌల్ట్రీ ఫామ్ మొత్తం ప్రత్యేకమైన కెమికల్స్తో శానిటైజ్ చేస్తున్నామని, చుట్టుపక్కల ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలిపామని అన్నారు. అలాగే పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే కార్మికులకు కూడా రక్త పరీక్షలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి వచ్చే మూడు నెలల వరకు సంబంధిత పౌల్ట్రీ ఫామ్ పూర్తిగా అధికా రుల ఆధీనంలో ఉంటుందని.. ఫామ్లో ఎటువంటి వైరస్ లేదని గుర్తించాకే మళ్లీ ఓపెన్ అవుతుందని అధికారులు తెలిపారు. చిన్నపిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.