విస్తరణకు నోచుకోని ఆమనగల్లు బస్టాండ్
ఆర్టీసీ అధికారులు ఆదాయం పై చూపుతున్న శ్రద్ధ ప్రయాణికులకు వసతులు కల్పించడంలో చూపించడం లేదు.

దిశ, ఆమనగల్లు : ఆర్టీసీ అధికారులు ఆదాయం పై చూపుతున్న శ్రద్ధ ప్రయాణికులకు వసతులు కల్పించడంలో చూపించడం లేదు. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి పై ఉన్న ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్ లో వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2003లో జాతీయ రహదారిని అనుసరించి ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. 22 ఏళ్లయినా ఆర్టీసీ బస్టాండ్ విస్తరణకు నోచుకోవడం లేదు. ఆమనగల్లు బస్టాండ్ మీదుగా శ్రీశైలం, హైదరాబాద్, యాదగిరిగుట్ట, సంగారెడ్డి, వరంగల్, నర్సంపేట, మాల్, దేవరకొండ, కల్వకుర్తి, అచ్చంపేట, మహబూబ్నగర్, కర్ణాటక కొల్లాపూర్, గోదావరిఖని, షాద్నగర్, నారాయణఖేడ్ వంటి దూరప్రాంతాలకు ప్రతినిత్యం వందల సంఖ్యలో బస్సులు నడుస్తుంటాయి.
వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. కానీ ఆమనగల్లు బస్టాండ్ లో కనీసం ప్రయాణికులకు తాగునీటి వసతి కూడా సరిగ్గా లేదు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నా స్పందన లేదు. ఆర్టీసీ బస్టాండ్ లో క్యాంటీన్ కూడా లేదు. అసలే ఇరుకుగా ఉన్న బస్టాండ్ లో ఓవైపు చెట్లు, మరోవైపు వాహనాల పార్కింగ్, దుకాణాల ఏర్పాటుతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ప్రయాణికులందరూ కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ విస్తరించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.