ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం..

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్​రెడ్డి ఆరోపించారు.

Update: 2023-02-18 16:31 GMT

దిశ, బడంగ్​పేట్​ : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకట్​రెడ్డి ఆరోపించారు. అల్మాస్​ గూడ శక్తి కేంద్రంలో ఇంచార్జ్ జి శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్​కు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో డివిజన్​లు, బస్తీలు ఏర్పడి 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీస వసతులు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులుగా ఉంటూ, కాలయాపన చేస్తున్నారే తప్ప చేసిన అభివృద్ది ఎక్కడా కనిపించదని దుయ్యబట్టారు. అప్పట్లో ఇక్కడ గ్రామపంచాయతీ లే అవుట్లుగా చేసి ప్లాట్లను విక్రయించి, అక్కడక్కడ పార్కు స్థలాలను వదిలారని, కొన్ని రోజుల తర్వాత స్థానిక నాయకుల అండదండలతో వాటిని బై నెంబర్లను వేసి ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

స్థానికేతురులైన కాలనీవాసులు ఈ కబ్జాల పర్వాన్ని చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ అసోసియేషన్ సభ్యులను కొందరిని గుప్పెట్లో పెట్టుకొని, వారి ఐక్యతను దెబ్బతీసి నాయకులు పబ్బం గడుపుతున్నారని, వీరి నిర్వాహకం వల్ల ఖాళీ స్థలం కనిపిస్తే మాయం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలన్నిటిపై భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తుందని రాబోయే రోజుల్లో వారి ఆట కట్టిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు జక్కిడి జంగారెడ్డి, రామిడి సూరకర్ణా రెడ్డి, ఎం. జె చారి, ఆర్. వీర కర్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News