పరమాన్నం.. గురుకుల భోజనం

తెలంగాణ రాష్ట్రంలో గురుకులల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈమధ్యే కామన్ డైట్ మెనూ ను ప్రారంభించింది.

Update: 2024-12-19 16:46 GMT

దిశ రంగారెడ్డి బ్యూరో / వికారాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గురుకులల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈమధ్యే కామన్ డైట్ మెనూ ను ప్రారంభించింది. గత శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన కామన్ డైట్ మెనూను ప్రారంభించగా, వికారాబాద్ జిల్లాలో ఎన్నేపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గత ప్రభుత్వం గురుకుల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిందన్న వారు, మా ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచడం, 200 కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నాం అన్నారు.

ఇదిలా ఉంటే కొత్త డైట్ మెనూ ప్రారంభం అయ్యే నేటికీ 7 రోజులు అవుతుంది. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలను సందర్శించగా కొత్త మెనూ పట్ల గురుకుల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ లో ఇలాంటి నాణ్యమైన పౌష్టికాహారం తింటామని ఊహించలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం ౯ సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉండగా, అందులో ఒకటి సాంఘీక సంక్షేమ డిగ్రీ కళాశాల ఉంది. ఇది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కొనసాగుతుంది. ఈ గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు సైతం ప్రభుత్వం తీరుపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. 40 శాతం డైట్ మెనూ ను పెంచడం కారణంగా పిల్లలు సంతోషంగా భోజనం చేస్తున్నారు. అందుకు కారణం అయినా తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

కొత్త మెనూ పట్ల విద్యార్థులు హర్షం

గతంలో హాస్టల్లో భోజనం చేయాలంటే అయిష్టంగానే తినేవాళ్ళం. ఇలాంటి నాణ్యమైన పౌష్టికాహారం తింటామని ఊహించలేదు. నెలలో మొదటి ఆదివారం, 3వ ఆదివారం రెండుసార్లు మటన్ కర్రీతో కూడిన మద్యాహ్నం భోజనం పెడుతున్నారు. మిగతా ఆదివారాలలో పాటు నెలలో మొదటి బుధవారంతో పాటు 3వ బుధవారం కూడా మొత్తం 4సార్లు చికెన్ కర్రీతో కూడిన నాణ్యమైన భోజనం పెడుతున్నారు. వీటితో పాటు ప్రతిరోజు టిఫిన్స్, పాలు, గుడ్డు పండ్లతో కూడిన నాణ్యమైన పౌష్టికాహారం పెడుతున్నారు. ఇంతమంది న్యూ డైట్ మెనూ అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైట్ ఛార్జీలు పెంచటం వలన హాస్టళ్లలో విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారం అందుతుంది. ఇంతకు ముందు నెలలో చికెన్ 4 సార్లు వచ్చేది కానీ ఇప్పుడు చికెన్ తో పాటు నెలలో 2 సార్లు మటన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతే కాకుండా పండ్లు, ప్రతిరోజు గుడ్డు, నెయ్యి మొదలైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నందుకు విద్యార్థులందరి తరపున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

కె.మనోహర్ సిద్దార్థ,10వ తరగతి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల, శివారెడ్డిపేట్, వికారాబాద్ జిల్లా

విద్యార్థులు సంతోషంగా భోజనం చేస్తున్నారు

తెలంగాణ ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచడం, 200 కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించడం అభినందనీయం. దీంతో విద్యార్థులు సంతోషంగా భోజనం చేస్తున్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించడం వల్ల అనారోగ్య సమస్యలు రావు, శరీర ఎదుగుదల కూడా పెరుగుతుంది. దాంతో చదువుపై మంచి దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.

కొండపనేని సాయిలత, డిసిఓ వికారాబాద్ జిల్లా.

నాణ్యమైన పౌష్టికాహారం పెడుతున్నారు

గతంతో పోల్చితే ఇప్పుడు ప్రతిరోజు నాణ్యమైన పౌష్టికాహారం పెడుతున్నారు. ఒకప్పుడు భోజనం చేయాలంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం రోజు ఒక వెరైటీ పెడుతున్నారు. ఆదివారం వస్తే చాలు మటన్, చికెన్ కర్రీతో భోజనం పెడుతున్నారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం మెనూ కార్పొరేట్ హాస్టల్స్ స్థాయిలో ఉందని చెప్పాలి. అందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.

దీక్షిత, ఇంటర్ 2వ సంవత్సరం, కొత్తగడి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల


Similar News