Road Repair : ఆగపల్లి-నోముల లింక్ రోడ్డుకు మోక్షం ఎప్పుడు..?.
ఆగపల్లి నుండి నోముల వరకు గల లింక్ రోడ్డు ప్రయాణం స్థానిక ప్రజలకు
దిశ,ఇబ్రహీంపట్నం : ఆగపల్లి నుండి నోముల వరకు గల లింక్ రోడ్డు ప్రయాణం స్థానిక ప్రజలకు నరకప్రాయంగా మారింది. మంచాల మండల కేంద్రానికి అనేక గ్రామాల నుంచి వెళ్లడానికి ఈ దారి సులభతరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రోడ్డు వెంట కంకర తేలి గోతులు ఏర్పడడం వల్ల కనీసం ద్విచక్ర వాహనదారులు కూడా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆగపల్లి నుండి నోములకు వెళ్లే రహదారి కోసం స్థానిక ప్రజలు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఈ యాచారం మండలంలోని అన్ని గ్రామాలతో పాటు చింతుల్ల, గున్ గల్, తులేకాలన్, ఆగగపల్లి, ఖానాపూర్ గ్రామల ప్రజలకు మంచాల మండల కేంద్రంతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లడానికి దారి సులభతరం అవుతుంది. గత ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే మల్ రంగారెడ్డి కూడా రోడ్డు పనులు చేపట్టాలని ఈ రోడ్డు వెంట పాదయాత్ర చేసిన సందర్భం ఉంది. అలాగే బిజెపి నాయకులు కూడా రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని పాదయాత్ర చేయడం జరిగింది. నిత్యం ఈ రోడ్డు వెంట ఆయిల్ కంపెనీ లారీలు తిరగడం వల్ల రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందని కాలుష్యాన్ని వెదజల్లే ఈ ఆయిల్ కంపెనీ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని తొందరగా ఈ రోడ్డు పని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి : బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి దూసరి సందీప్ గౌడ్.
ఆగపల్లి నుండి నోముల వరకు గల 4 కిలోమీటర్ల ఈ దారి అభివృద్ధి చేయడం వల్ల ఎన్నో గ్రామాల ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుందని గతంలో దూసరి సరిత తన ఎంపీటీసీ నిధుల నుండి ఈ దారి అభివృద్ధికి 2013 సంవత్సరంలో 5 లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీని నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మాల్ రెడ్డి రామ్ రెడ్డి లు ఈ రోడ్డుపై దృష్టి సారించి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపారు.