Ramoji Rao :రామోజీరావు కన్నుమూత.. జర్నలిస్టులకు పవన్ కల్యాణ్ కీలక పిలుపు
రామోజీ రావు మృతి పట్ల జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రామోజీ రావు మృతి పట్ల జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతతో హాస్పిటల్ లో చేరిన ఆయన కోలుకుంటారని భావించినట్లు తెలిపారు. ఆయన లేరనే వార్త ఆవేదన కలిగించిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామోజీ స్థాపించిన ఈనాడు పత్రిక దేశ పత్రికా రంగంలో పెను సంచలనం అన్నారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని ఆయన నిరూపించారని కొనియాడారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ.. జన చైతన్యాన్ని కలిగించారని గుర్తు చేశారు. వర్తమాన రాజకీయాలపై పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాకుండా.. ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడి చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేశారన్నారు. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు.
పత్రికాధిపతిగానే కాకుండా నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను వేదికగా చేశారన్నారు. మీడియా మొఘల్‌గా ఆయన అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారని పేర్కొన్నారు. అక్షర యోధుడు రామోజీరావు అస్తమయం తెలుగు ప్రజలను కలిచివేసిందన్నారు. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రామోజీరావు కుటుంబానికి తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలిపారు.