రామ‌ప్ప ఘ‌న‌త‌ను ప్రపంచ దేశాల‌కు చాటేలా ప్రగతి: మంత్రి సీత‌క్క

ప్రపంచ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తింపు పొందిన రామ‌ప్ప దేవాల‌య అభివృద్ది ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు.

Update: 2024-09-11 16:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తింపు పొందిన రామ‌ప్ప దేవాల‌య అభివృద్ది ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. యునెస్కో ప్రమాణాల‌కు అనుగుణంగా ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని సూచించారు. మంత్రి సీతక్క అధ్యక్షతన సచివాలయంలో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం రాష్ట్ర స్థాయి మేనేజెంట్ కమిటీ సమావేశం బుధ‌వారం జ‌రిగింది. యువ‌త‌, సాంస్క్రృతిక‌, టూరిజం శాఖల‌ కార్యదర్శి వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర్ టీ. ఎస్, పురావస్తు, దేవాదాయ శాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్న స‌మావేశంలో రామప్ప దేవాలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క మాట్లాడుతూ.. గొప్ప చరిత్రతో అద్బుత‌మైన క‌లా సంప‌ద రామప్ప దేవాలయం సొంత‌మ‌న్నారు. అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయమైనందున‌.. రామప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో గడువులోపు పనులు పూర్తి చేయాలన్న సీత‌క్క.. పనుల్లో అలసత్వం వహిస్తే చరిత్ర, ప్రజలు క్షమించరని తెలిపారు. రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రాంతాలు, టూరిజం కేంద్రాలున్నందున‌… టురిస్ట్ హ‌బ్ గా రామ‌ప్ప ను డెవ‌ల‌ప్ చేయాల‌న్నారు.

లక్నవరం, బొగత, సమ్మక్క సారలమ్మ దేవాలయం వంటి ఎన్నో చారిత్రక ప్రాంతాలు, అట‌వీ సంప‌ద, ప్రకృతి సౌంద‌ర్యం పుష్కలంగా ఉన్న‌ ములుగు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానే ఆక‌ర్శిస్తుంద‌న్నారు. ప‌ర్యాట‌కులు బ‌స‌చేసేందుకు వీలుగా టూరిజం కార్పొరేష‌న్ అన్ని హంగుల‌తో హోటల్లను నిర్మించాల‌ని సూచించారు. రామప్ప చుట్టుపక్కల సహజత్వాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి పనులు చేప‌ట్టాల‌న్నారు. రామప్ప వారసత్వ సంపద గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు ప్రపంచ దేశాలకు చాటి చెప్పే యజ్ఞంలో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని సూచించారు.

ఎక్కడా లోపాలు జ‌ర‌క్కుండా అభివృద్ధి పనులు చేప‌ట్టాల‌న్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా త‌న‌ దృష్టికి తీసుక‌రావాల‌న్నారు. తాను ఎల్లపుడూ అందుబాటులోనే ఉంటాన‌ని.. మంత్రి హోదాల్లో ఉన్నంత మాత్రాన దూరం అయినట్లు కాదని పేర్కొన్నారు. రామ‌ప్ప అభివృద్ది విష‌యంలో ఏ చిన్న సమస్య వచ్చినా త‌న‌ను సంప్రదించ వచ్చని అధికారుల‌కు సూచించారు. రామప్ప దేవాలయంతో పాటు, రామప్ప చెరువు, ఆ చుట్టు పక్క ప్రాంతాల ను సుంద‌రంగా తీర్చిదిద్దాల‌న్నారు. అయితే రామప్ప చెరువు, దేవాలయం కి ఆటంకం కలిగించే మైనింగ్, ఇత‌ర‌ పనులకు అనుమతులు ఇవ్వమని మంత్రి సీత‌క్క స్పష్టం చేశారు.


Similar News