ప్రపంచంలొనే గొప్ప పోరాటం చేసి తెలంగాణ సాధించిన మహానేత KCR: రామనర్సింహ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతుల రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతుల రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ వీరమళ్ళ రామనర్సింహ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో అహింసాయుతంగా ప్రపంచంలొనే గొప్ప పోరాటాన్ని జరిపి తెలంగాణలోని సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్ అని అన్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఏ పిలుపిచ్చినా ఉస్మానియా విద్యార్థులుగా అనేక పోరాటాలు చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెంట నడిచామన్నారు. సాధించిన తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే తలమానికంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమంలో విద్య, వైద్యంలో పరిపాలన సౌలభ్యంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఇరిగేషన్‌లో వ్యవసాయ రంగంలో ఐటీ పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ రంగంలో దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నేతలు కొంపల్లి నరేష్, గణేష్, విజయ్, శ్రావణ్ సంజయ్, శేఖర్, శ్రీధర్, నరేష్, అజీజ్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.