రాజ్ భవన్ VS ప్రగతిభవన్.. గ్యాప్‌తో కొలువుదీరని కమిషన్లు

రాజ్ భవన్ అంటే ప్రభుత్వం భయపడుతుందా? అందుకే గవర్నర్ ఆమోదం కోసం ఫైల్స్ పంపడం లేదా?

Update: 2023-05-25 03:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్ భవన్ అంటే ప్రభుత్వం భయపడుతుందా? అందుకే గవర్నర్ ఆమోదం కోసం ఫైల్స్ పంపడం లేదా? ఆ కారణంగానే ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ కమిషన్ భర్తీ పెండింగ్‌లో పడ్డాయా? లేక ఆ కమిషన్ భర్తీపై నిర్లక్ష్యమా? అలాగే.. త్వరలో ఖాళీ అయ్యే గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ భర్తీ చేపడతారా? దాన్ని కూడా పెండింగ్‌లో పెడతారా? అనే చర్చ జోరుగా సాగుతుంది. రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య నెలకొన్న విబేధాల కారణంగా పలు పాలన నిర్ణయాలపై ఎఫెక్ట్ పడుతుందనే టాక్ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

రెండేళ్లుగా వివాదాలు

రెండేళ్లుగా రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య విబేధాలు నెలకొనగా.. సమయం వచ్చిన ప్రతిసారి పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మంత్రులు ఆరోపిస్తుంటే, మహిళా గవర్నర్ అయినందుకే వివక్ష చూపుతున్నారని తమిళిసై విమర్శలు చేస్తున్నారు.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆపుతున్నారని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. దీంతో కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు, ఇంకొన్ని బిల్లులపై వివరణకు ప్రభుత్వానికి పంపిన గవర్నర్ రెండు బిల్లులను మాత్రం రిజక్ట్ చేశారు. ఈ రెండు వ్యవస్థలపై మధ్య నెలకొన్న విబేధాలు పాలనా పరమైన నిర్ణయాలపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.

అడ్డస్తోన్న అహం?

రాష్ట్రంలో కీలకమైన హ్యూమన్ రైట్స్, సమాచార హక్కు చట్టం కమిషన్లను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. డిసెంబరు 2022లో హ్యూమన్ రైట్స్ కమిషన్ పదవి కాలం ముగిసింది. ఆర్టీఐ కమిషన్ కాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తయింది. అప్పట్నించి ఈ రెండు ఆఫీసుల్లో చీఫ్ కమిషనర్, కమిషనర్ లేకుండా ఖాళీగా ఉన్నాయి.

ఈ రెండు కమిషన్లను భర్తీ చేయాలంటే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వ సిపారసులను గవర్నర్ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే విబేధాలు నేపథ్యంలో ‘‘ఇలాంటి సమయంలో మళ్లీ గవర్నర్ వద్దకు ఫైల్స్ పంపేందుకు సీఎం సిద్ధంగా లేరు. ఆమెకు అహం ఉంటే, తమకు ఉండదా?’’అని సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి కామెంట్ చేశారు. అవసరం వచ్చినప్పుడు కమిషన్లను భర్తీ చేస్తామని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ భర్తీ కూడా పెండింగేనా?

ఈనెల 27న గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలోనే వాటిని భర్తీ చేస్తారని లీకులు వచ్చాయి. కానీ.. కేబినెట్ రోజు మాత్రం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాన్ని తర్వాత చూద్దామని పెండింగ్‌లో పెట్టారనే ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్సీల అంశం వాయిదా వేయడం వెనక బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తున్నది. కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్ లో పెడుతుందేమోనని అనుమానం బీఆర్ఎస్ పెద్దల్లో ఉంది. గతంలో గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి పేరును మంత్రివర్గం సిపారసు చేస్తే, ఆ ఫైల్‌ను గవర్నర్ ఆమోదించలేదు. చివరికి ఆ స్థానంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారిని రికమెండ్ చేశారు. అందుకే ఈసారి వివాదాలు లేని వ్యక్తుల పేర్లను సిపారసు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

నో ఆర్డినెన్స్.. ఒన్లీ బిల్స్

గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు ప్రభుత్వం పాలన అవసరాల కోసం చాలా ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఆ తర్వాత వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లులుగా మార్చుకునేది. కానీ తమిళిసై తో విబేధాలు మొదలైనప్పట్నించి ప్రభుత్వం ఒక్క ఆర్డినెన్స్ కూడా తేలేదు. ఎందుకంటే ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. దీంతోనే ప్రభుత్వం ఎంత అత్యవసరమైన అంశాలు ఉన్నా ఆర్డినెన్స్ జోలికి వెళ్లకుండా కేవలం బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది.

ఇవి కూడా చదవండిరాష్ట్రపతికి వర్తించే నియమం గవర్నర్‌కు వర్తించదా? తమిళిసై సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News